మాస్ మహారాజ్ రవితేజ, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ నిర్మాత నాగ వంశీని మాట్లాడవలసిందిగా ఆహ్వానించినప్పుడు, ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.
అప్పుడు ఆమె స్పందిస్తూ, వంశీగారు చూశారా మీకూ ఎంత మంచి అభిమానులున్నారో? రండి వారితో మాట్లాడండి,” అని అన్నారు. ఇటువంటి సందర్భాలలో చాలా దూకుడుగా మాట్లాడే నాగ వంశీ స్పందిస్తూ, “వద్దులెండి... వాళ్ళని చూసి నేను రెచ్చిపోతే తర్వాత నేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
రవితేజ అభిమానులు ఆయన సినిమాలో ఏమేమి చూడాలనుకుంటారో అవే ఉంటాయి. రెండు నిమిషాల ట్రైలర్‌లో ఏమేమి ఉన్నాయో 2 గంటల సినిమాలో అవే ఉంటాయి. కనుక ఈ సినిమా అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను.
ఒకవేళ నచ్చకపోతే నన్ను తిట్టుకోవడానికి సుమ సోషల్ మీడియా హ్యాండిల్ వాడుకోండి. ఈసారి నేను దుబాయ్ వెళ్ళడం లేదు,” అని ముగించారు.
వార్-2 సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది తనను చాలా దారుణంగా ట్రోల్ చేశారని రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ చెప్పారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కనుక తాను ఆస్తులు అమ్మేసుకొని దుబాయ్ వెళ్ళిపోతున్నానని కొందరు ట్రోల్ చేశారన్నారు.
ఒకానొక సమయంలో ఆ ట్రోలింగ్ భరించలేక చాలా బాధపడ్డానన్నారు. తాను పబ్లిక్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో దూకుడుగా మాట్లాడుతుండటం నచ్చకనే కొందరు తనతో ఈవిదంగా ఆడుకున్నారని నాగ వంశీ చెప్పారు.
కనుక మాస్ జాతర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాస్త ఆచితూచి మాట్లాడుతూనే తనను ట్రోల్ చేసిన వారికి చురకలు వేశారు. తాను దుబాయ్ పారిపోలేదని ‘మాస్ జాతర’తో సూపర్ హిట్ కొట్టి సినీ పరిశ్రమలోనే ఉండబోతున్నానని చెప్పకనే చెప్పారు. తనను ఎద్దేవా చేసినవారికి నాగ వంశీ ఈవిదంగా చురక వేశారు.