మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఈరోజు తెల్లవారుజామున కన్ను మూశారు. మాజీ సిఎం కేసీఆర్‌తో సహా పార్టీ ముఖ్య నేతలందరూ వచ్చి హరీష్ రావుకు సంతాపం తెలిపి, ఆయన తండ్రికి నివాళులు అర్పించారు. కల్వకుంట్ల కవిత కూడా దగ్గర బంధువే కనుక ఆమె విభేదాలు పక్కన పెట్టి తప్పకుండా వచ్చి పరామర్శిస్తారని అందరూ భావించారు. కానీ ఆమె రాలేదు.
సోషల్ మీడియాలో “మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను,” అంటూ ఓ సంతాప సందేశం పెట్టారు.
ముందు ప్లాన్ చేసుకున్న విధంగా జాగృతి జనం బాట కార్యక్రమంతో ముందుకు సాగిపోయారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ని, కరివెన రిజర్వాయర్‌ని సందర్శించి, నిర్వాసితులతో మాట్లాడారు.
పార్టీలో తనకు వ్యతిరేకంగా హరీష్ రావే కుట్రలు చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన కారణంగానే తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆగ్రహం ఉండటం సహజం. కనుకనే హరీష్ రావుని పరామర్శించేందుకు కల్వకుంట్ల కవిత ఇష్టపదలేదనుకోవచ్చు.