అదొక పెద్ద క్లబ్బులాగ మారింది: ట్రంప్

December 28, 2016
img

అమెరికా అధ్యక్షుడుగ ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితిని కూడా విడిచిపెట్టలేదు. “అది చాల శక్తివంతమైన సంస్థ. కానీ అదిప్పుడు కొంతమంది కలిసి ఒకచోట సేద తీరే క్లబ్ గా మారిపోవాదం చాలా దురదృష్టకరం,” అని ట్వీట్ చేశారు. దాని గురించి డోనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పుగా అనిపిస్తున్నా ఐరాస పని తీరు చూస్తున్నట్లయితే ఆయనతో ఏకీభవించకుండా ఉండలేము. 

అది టర్కీలో నాటో దళాలకు రష్యాకు మద్య జరుగుతున్న ఘర్షణలని నివారించలేకపోతోంది. ఉత్తర కొరియా, చైనాల దూకుడుకి అడ్డుకట్ట వేయలేకపోతోంది. భారత్ పైకి పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపిస్తుంటే ఏమీ చేయలేకపోతోంది. అదే పాకిస్తాన్ కి అమెరికా ఏటా కోట్లాది డాలర్లు సహాయం చేస్తుంటే ధైర్యంగా ప్రశ్నించలేకపోతోంది. నానాటికీ పెరిగిపోతున్న ఐసిస్ ఉగ్రవాదాన్ని, ఆ కారణంగా పెరిగిపోతున్న శరణార్ధుల సమస్యలని, పర్యావరణ సమస్యలని ఇంకా అనేకానేక సమస్యలని పరిష్కరించలేకపోతోంది. 

ఐక్యరాజ్యసమితి సమావేశాలు అంటే ఏవో కాలక్షేప సమావేశాలని వాటి నుండి  ఎటువంటి కీలక నిర్ణయాలు రావని, వచ్చినా అమలు చేయబడవనే నిశ్చితాభిప్రాయం ప్రపంచ ప్రజలకి ఏర్పడింది అంటే అతిశయోక్తి కాదు. అగ్ర రాజ్యాలు ఇస్తున్న నిధులతోనే అది మనుగడ సాగిస్తోంది కనుక అది వాటి కనుసన్నలలోనే పనిచేస్తోంది. అందుకే ఐక్యరాజ్యసమితి అంటే అగ్రరాజ్యాలు తీసుకొనే నిర్ణయాలకు ఆమోదముద్రలు వేసే సంస్థగా మిగిలిపోయింది. దాని ఈ నిసహ్హాయత కారణంగానే అది ఒక అతిపెద్ద ఖరీదైన పెద్ద క్లబ్ గా మారిపోయిందని చెప్పక తప్పదు.

దానిలో అనేక నిరుపేద దేశాలు సైతం సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఆ దేశ ప్రతినిధులు దానిలో చేయగలిగేదేమీ ఉండదు కనుక అటువంటి వారందరికీ అది ఒక మంచి కాలక్షేపం చేసే పెద్ద క్లబ్ గా మారిపోయిందని చెప్పక తప్పదు. ఐరాసలో నియామకం అంటే అదొక స్టేటస్ సింబల్ గా లేదా గొప్ప మేధావనే అభిప్రాయం వ్యక్తం అవుతుంటుంది. అయితే అక్కడ వాళ్ళు చేసే పనేమిటో, దాని వలన ఆయా దేశాలకి లేదా ప్రపంచానికి ఉపయోగం ఏమిటో ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకి భారత్ తరపున చాలా కాలంపాటు ఐరాసలో పని చేసిన శశి ధరూర్ అక్కడ ఏమి వెలగబెట్టారో ఎవరికీ తెలియదు. కానీ భారత్ లో అయన నిర్వాకాల గురించి అందరికీ తెలుసు. మిగిలిన దేశలా సభ్యులది కూడా బహుశః ఇదే పరిస్థితి అయ్యుండవచ్చు. 

అయితే ఐరాస పూర్తిగా ఎందుకు పనికిరాని సంస్థ అని కూడా చెప్పలేము. దాని నిస్సహాయత కారణంగా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోలేకపోయినా ప్రపంచంలో వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా దేశాలలో ప్రజల కోసం అది చేస్తున్న సేవలు అపూర్వం. ఐరాస అధ్వర్యంలో అనేక దేశాలలో నిరుపేదలకు పౌషికాహారం, విద్య, మందులు, వైద్యం, ఆరోగ్యం, ఇళ్ళ నిర్మాణం వంటి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. తన పరిధిలో తనకు చేతనైన పనులు చేసుకొంటోంది. ప్రపంచ దేశాలన్నిటినీ అదుపు తప్పకుండా గాడిన పెట్టవలసిన ఐక్యరాజ్యసమితి ఈవిధంగా సర్దుకుపోతున్నందుకు సంతోషించాలో లేక బాధ పడాలో తెలియదు.

Related Post