అమెరికాలో తెలంగాణ యువకుడుని కొందరు దుండగలు తుపాకులతో కాల్చి హత్య చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు కుంచ అన్షుల్ (28) ఉద్యోగం నిమిత్తం 2023లో అమెరికాకు వెళ్లాడు.
అక్కడ నార్త్ ఫిలడెల్ఫియాలోనివాసం ఉంటూ, అదనపు ఆదాయం కోసం వారాంతపు సెలవు రోజుల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా కేడబ్ల్యూసీ పిజ్జా సెంటర్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి ఎడ్‌గ్లీ స్ట్రీట్‌లోని రేమండ్ రోజెస్ హోమ్స్ వద్ద గల ఓ ఇంటి నుంచి మూడు పిజ్జాల కోసం ఆర్డర్ వచ్చింది. అన్షుల్ వాటిని తీసుకొని డెలివరీ ఇచ్చేందుకు అర్ధరాత్రి సుమారు 12:30 గంటలకు అక్కడకు చేరుకున్నాడు. అతను పిజ్జా బాక్సులు పట్టుకొని ఆ ఇంటి వైపు నడుస్తుండగా మాస్కులు ధరించిన కొందరు దుండగులు చుట్టుముట్టి అన్షుల్‌పై తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వాటిలో ఒకటి తలలో నుంచి దూసుకుపోవడంతో అన్షుల్ అక్కడే కూలిపోయి విలవిలలాడుతూ చనిపోయాడు.
తుపాకీ కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అతని వివరాలు సేకరించి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్న అతని తల్లి తండులకు ఈ విషాదవార్త తెలియజేశారు.
అమెరికాలో కొడుకు ఉద్యోగం సంపాదించుకొని అక్కడ స్థిరపడ్డాడనుకుంటే అన్యాయంగా ఎవరి చేతిలోనో చనిపోయాడని ఆ తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి శవాన్ని తీసుకువచ్చేందుకు తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయపడాలని వారు విజ్ఞప్తి చేశారు.