మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకుపోతుందని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అభ్యర్ధన మేరకు హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు మరో రెండు వారాలు గడువు పొడిగించారు. అంతవరకు ఇరాన్ మీద అమెరికా దాడులు చేయదని ప్రకటించారు. పాక్ సూచనకు ఇరాన్ కూడా అంగీకరించి రెండు వారాలపాటు కాల్పుల విరమణకు, జలసంధిని తెరిచేందుకు అంగీకరించింది. దీంతో చమురు ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. భారత్‌తో సహా ప్రపంచ దేశాల షేర్ మార్కెట్లు నేడు మళ్ళీ శరవేగంగా పుంజుకొని లాభాల బాట పట్టాయి.
ట్రంప్ స్పందిస్తూ, “ప్రపంచ శాంతికి ఇదొక ముందడుగుగా భావిస్తున్నాము. ఇరాన్ పది షరతులతో ఒక ప్రతిపాదన పంపింది. అది మాకూ అంగీకారమే. కనుక ఇరాన్‌తో శాశ్విత శాంతి ఒప్పందానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని భావిస్తున్నాము,” అని అన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ స్పందిస్తూ, “ఇది యుద్ధం ముగింపుకి సంకేతం కాదు. ఒకవేళ శత్రుదేశాలు మళ్ళీ దురాక్రమణకు ప్రయత్నిస్తే ధీటుగా బదులిస్తాము. మా వేళ్ళు ఇంకా ట్రిగర్ మీదనే ఉన్నాయి. పాక్ సూచన మేరకు రెండు వారాలు కాల్పులు విరమణకు అంగీకరించాము,” అని అన్నారు.