మాల్యాని వెనక్కి రప్పించడం అసాధ్యమా?

November 04, 2016
img

తలుపులు నమిలేసేవాడికి అప్పడాలు నమలడం ఓ లెక్కా? అన్నట్లు సుప్రీంకోర్టు ఆదేశాలనే ఖాతరు చేయని విజయ్ మాల్యాకి వేరే కోర్టులు ఇచ్చే తీర్పులు, అరెస్ట్ వారెంటులు చూసి భయపడతాడా? గతంలో డిల్లీ కోర్టు తను జారీ చేసిన ఆదేశాలని అతను పట్టించుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ నిన్న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

దేశంలో 17 బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన అతనిని వెనక్కి రప్పించడానికి బ్యాంకులు, కోర్టులు, ఈడి అధికారులు చాలా నోటీసులు పంపాయి. కానీ రాలేదు. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయించి వెనక్కి రప్పించాలని ప్రయత్నిస్తే, బ్రిటన్ ప్రభుత్వం అందుకు తమ చట్టాలు అనుమతించవని తేల్చి చెప్పేసింది. కనుక ప్రభుత్వం అతని పాస్ పోర్ట్ ని రద్దు చేసింది. కానీ రాలేదు. రాజ్యసభ సభ్యత్వం రద్దు చేశారు..కానీ రాలేదు. ఆస్తుల వేలం వేస్తున్నారు అయినా కూడా అతనిని వెనక్కి రప్పించలేకపోతున్నారు. భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ఈడి ఎవరూ కూడా ఆయనని లండన్ నుంచి భారత్ కి తిరిగి రప్పించలేకపోతున్నారు.   

నిజానికి అతను లండన్ పారిపోతున్నప్పుడే ఆపి ఉండాల్సింది కానీ అప్పుడు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అని అనడం కంటే ఆపలేదని చెప్పడమే సబబుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే అతని పరిస్థితి బాగోలేదని అందరికీ తెలుసు. కనుక అతను ఏదో ఒక రోజు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కేంద్రప్రభుత్వానికి, నిఘా సంస్థల ఈడి, బ్యాంక్ లకి అన్నిటికీ ఖచ్చితంగా తెలుసు. విజయ్ మాల్యా లండన్ పారిపోయే రెండు రోజుల ముందు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దానికి జైట్లీ సమాధానం చెప్పనే లేదు. 

అందుకే అతను విదేశాలు పారిపోవడానికి అవకాశం కల్పించినట్లు భావించవలసి ఉంటుంది. కనుక  అప్పుడే అతనిని దేశం విడిచి పారిపోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించనివారు ఇప్పుడు  వెనక్కి రప్పించాడానికి  ప్రయత్నిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. దేశప్రజలని మభ్యపెట్టేందుకే అతనిని వెనక్కి రప్పించడానికి కేంద్రప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు నటిస్తోందేమో? కనుక మాల్యా మాత్రమే కాదు మన రాజకీయ నేతలు కూడా ప్రజలని మోసం చేస్తున్నట్లే భావించవలసి ఉంటుంది.

Related Post