ఎన్.ఆర్.ఐ.లకి రిపబ్లికన్ పార్టీ విజ్ఞప్తి

October 24, 2016
img

నవంబర్ 8న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగబోతున్నాయి.  అంటే నేటికి సరిగ్గా రెండు వారాలు సమయం మాత్రమే మిగిలి ఉందన్నమాట. కనుక యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ఈ అత్యున్నతమైన పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల అభ్యర్ధులు డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లకి మిగిలిన ఈ రెండు వారాలు చాలా కీలకమైన సమయం. ఇంతకాలం వీరిరువురే యావత్ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నపటికీ, అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)కి ఆ రెండు పార్టీల అభ్యర్ధులు కూడా పోటీ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక వారందరికీ కూడా మిగిలిన ఈ రెండు వారాలు చాలా కీలకమైన సమయమేనని చెప్పవచ్చు. కనుక ఆ రెండు పార్టీల అభ్యర్ధులు కూడా అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయులతో సహా వివిద దేశస్తులందరినీ తమకే ఓటువేయాలని కోరుతూ లేఖలు వ్రాస్తున్నారు. ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అభ్యర్దిస్తున్నారు. 

ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రంలో 10వ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న బార్బరా జీన్ బర్న్స్ కాంస్టాక్  కూడా మళ్ళీ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తనకి ఓటు వేయవలసిందిగా కోరుతూ ఆమె ప్రవాస భారతీయులకి ఒక లేఖ వ్రాశారు. 

దానిలో ఆమె “నమస్కారం! అమెరికా కాంగ్రెస్ లో భారతీయ అమెకరికన్ కమ్యూనిటీని ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తాను. నవంబర్ 8 (మంగళవారం) దయచేసి నాకు ఓటువేసి గెలిపించండి,” అని కోరారు. ఆ లేఖలో విశేషం ఏమిటంటే, హిందీ, తెలుగు, బెంగాలీతో ఐదు భారతీయ బాషలలో ఈ విజ్ఞప్తి చేశారు. డెమొక్రాట్ అభ్యర్ధుల నుంచి కూడా ప్రవసభారతీయులకి అటువంటి లేఖలు అందుతున్నాయని సమాచారం. 

రిపబ్లికన్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ తను అధ్యక్షుడైనట్లయితే దేశంలో స్థిరపడిన ప్రవాసభారతీయులతో సహా విదేశీయులందరినీ దేశం నుంచి మెడపట్టుకొని బయటకి గెంటేస్తానని ప్రకటించి మళ్ళీ వారి సహాయమే కోరడం చాలా విడ్డూరంగా ఉంది. ఇటీవల హిల్లారీ క్లింటన్ తో జరిగిన చిట్టచివరి ముఖాముఖి చర్చలో ఈ విషయంలో ట్రంప్ కొంచెం మెత్తబడినట్లు కనబడినప్పటికీ, ఆయన వైఖరిలో పెద్దగా మార్పు లేదని స్పష్టం చేసుకొన్నారు. కనుక విదేశీయులని వెనెక్కి త్రిప్పి పంపివేస్తానని ట్రంప్ చెపుతున్నప్పుడు, వారు తమ పార్టీ అభ్యర్ధులకి ఎందుకు ఓట్లు వేస్తారు? కనుక వారికి ఇటువంటి లేఖలు వ్రాసి ప్రయోజనం ఏమిటి? అనే ఆలోచన రిపబ్లికన్ పార్టీకి కలగకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.

Related Post