మీడియా చేతిలో ట్రంప్ ఓటమి?

October 21, 2016
img

అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ కి నోటి దురద ఎక్కువే కావచ్చు. మహిళలతో అనుచితంగా మాట్లాడి, అసభ్యంగా వ్యవహరించి ఉండవచ్చు. పలు అంశాలపై ఆయన మాటలు, చేష్టలు తప్పుగా ఉండవచ్చు. అలాగే ఆయన విధానాలు కూడా చాలా తప్పుగా ఉండవచ్చు. కనుక ఆయనని దేశాధ్యక్షుడుగా ఎన్నుకోవాలో వద్దో అనేది అమెరికన్ ప్రజలు ఆలోచించుకోవలసిన విషయం. కానీ జాతీయ మీడియా నిర్ణయించడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే ‘జాతీయ మీడియా ఎన్నికల రిగ్గింగ్ కి పాల్పడుతోందని’ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. అది అక్షరాల నిజమని చెప్పక తప్పదు. ఎందుకంటే ట్రంప్ విజయవకాశాలని చావు దెబ్బ తీసింది హిల్లరీ క్లింటన్ కాదు అమెరికన్ మీడియాయే! 

అది పనిగట్టుకొని ట్రంప్ గత చరిత్ర, ఆయనకి వ్యతిరేకంగా చాలా వార్తలు, కధనాలు ప్రసారం చేసింది ఇంకా చేస్తూనే ఉంది. సర్వోన్నతమైన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి అన్ని విధాల అర్హుడైన, సమర్ధుడైన వ్యక్తిని ఎన్నుకోవడం చాలా అవసరమే. కనుక ఆ పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్ధుల గుణగణాల గురించి ప్రజలకి తెలియజేయవలసిన భాద్యత మీడియాపై ఉంటుంది. కానీ ఆ పేరుతో మీడియా తాను వ్యతిరేకిస్తున్న ట్రంప్ ని ఓడించే ప్రయత్నాలు చేయడమే విస్మయం కలిగిస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే ట్రంప్ పై మీడియా తన అభిప్రాయాలని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నట్లు చెప్పవచ్చు. ఎప్పుడో 15-20 ఏళ్ళ క్రితం ట్రంప్ తమతో అసభ్యంగా వ్యవహరించారని పిర్యాదు చేస్తున్న యువతుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. ఆయన వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించి ఉండి ఉంటే, ఇన్నేళ్ళు మౌనంగా ఊరుకొని సరిగ్గా ఎన్నికల ప్రక్రియ కీలక దశకి చేరుకొని అభ్యర్ధుల భవితవ్యం తేలబోతున్న ఈ సమయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే అర్ధం ఏమిటి? మీడియా కూడా అటువంటి వారిని ప్రోత్సహిస్తోందంటే అర్ధం ఏమిటి? ఏదో విధంగా ట్రంప్ విజయావకాశాలని నాశనం చేసి ఓడించడమే లక్ష్యంగా చేస్తున్నట్లు కనబడుతోంది. అందుకు మీడియాకి తన కారణాలు, ఉద్దేశ్యాలు, ప్రయోజనాలు ఉండవచ్చు. అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడుతున్న వ్యక్తి ప్రజల చేతిలో ఓడిపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకొంటుంది. కానీ మీడియా చేతిలో ఓడిపోతే?

Related Post