సౌదీలో కలకలం రేపుతున్న ఆ మరణశిక్ష

October 19, 2016
img

సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాలన్నిటిలో నేటికీ రాజరిక పరిపాలనే కొనసాగుతుండటం అందరికీ తెలిసిందే. మిగిలిన గల్ఫ్ దేశాలకంటే సౌదీ అరేబియాలో ఇస్లాం మతాచారాలని చాలా ఖచ్చితంగా పాటిస్తుంటారు. అక్కడ రాజు, ధనికుడు, పేద అనే తేడా చూడకుండా తప్పు చేస్తే ఎంతటి వారికైనా ఒకే రకంగా చాలా కటినంగా శిక్షిస్తుంటారు. అందుకు ఉదాహరణగా సౌదీ రాజ కుటుంబానికి చెందిన తుర్కి-బిన్-సౌద్-అల్-కబీర్ కి సోమవారంనాడు మరణదండన అమలుచేసి చూపించింది. 

ఆయన సుమారు నాలుగేళ్ళ క్రితం ఒక యువకుడితో గొడవ పడినప్పుడు ఆవేశంతో అతనిని తుపాకితో కాల్చి చంపాడు. చేసిన తప్పుని గ్రహించి ఆయనే స్వయంగా పోలీసులకి తెలియజేశాడు. ఆ కేసుని దర్యాప్తు చేసిన సౌదీ పోలీసులు అతను హత్య చేసినట్లు దృవీకరించడంతో 2014లో అతనికి కోర్టు మరణశిక్ష విదిస్తూ తీర్పు చెప్పింది. సాధారణంగా అటువంటి కేసులలో సౌదీ రాజు, ప్రభుత్వం ఎవరూ కలుగజేసుకోరు. కనుక హంతకుడిని ఎవరూ కాపాడే అవకాశం ఉండదు. హతుడి తల్లితండ్రులు లేదా భార్యకి మాత్రమే క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. బహుశః యువరాజుకి న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేసిన తరువాత రాజ కుటుంబం హతుడి కుటుంబ సభ్యులని ప్రాణభిక్ష కోరి ఉండవచ్చు. కానీ వారు నిరాకరించినందునే యువరాజుకి మరణ శిక్ష అమలు చేసినట్లు భావించవలసి ఉంటుంది. ఆ మరణశిక్ష కూడా చాలా భయానకంగా ఉంటుంది. పదునైన కత్తితో శిరస్సు ఖండిస్తారు. 

“సౌదీలో న్యాయవ్యవస్త పారదర్శకతకి ఇది అద్దం పడుతోంది,” అని యువరాజు దగ్గర బంధువు అబ్దుల్ రహ్మాన్ అల్-ఫలాజ్ అరబ్ న్యూస్ తో అన్నారు. 

సౌదీ అరేబియాలో గత ఏడాది 158 మందికి ఈవిధంగా మరణ శిక్ష అమలుచేయగా, ఈ ఏడాది యువరాజుకి విదించిన ఈ శిక్షతో కలిపి మొత్తం 134 మందికి మరణశిక్ష అమలుచేశారు 

సౌదీలో హత్యలు, మానభంగం, మాదకద్రవ్యాల సరఫరా లేదా వినియోగం మొదలైన వాటిని చాల తీవ్ర నేరాలుగా పరిగణించి మరణశిక్షలు విధిస్తుంటారు. ప్రతీ ఏటా ఇటువంటి కేసులలో కనీసం 100-200 మందికి ఈవిధంగా మరణశిక్షలు అమలుచేస్తూనే ఉంటారు. దొంగతనం వంటి నేరాలకి చేతులు నరకడం, చిన్నచిన్న నేరాలకి కొరడాదెబ్బలు సర్వ సాధారణమైన విషయం అక్కడ. అందుకే సౌదీలో నేరాలు చేయడానికి, అటువంటి ఆలోచనలు చేయడానికి కూడా అందరూ చాలా భయపడుతుంటారు. కనుక అక్కడ నేరాల సంఖ్య కూడా చాలా తక్కువే. కానీ ఇటువంటి కటినమైన శిక్షలు విదించడం మానవహక్కుల ఉల్లంఘనే అని వాదనలు వినిపిస్తున్నా వాటిని సౌదీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. శిక్షలు వేయడం మానుకోలేదు. దాని కటిన వైఖరికి ఇప్పుడు రాజకుటుంబ సభ్యుడే బలైపోయాడు.    


Related Post