ట్రంప్ కార్యాలయంపై బాంబు దాడి!

October 17, 2016
img

ఉత్తర కరోలినాలో గల రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై ఆదివారం రాత్రి బాంబు దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయం కిటికీలో నుంచి బాంబులు విసరడంతో లోపల ఉన్న ఫర్నీచర్, వస్తువులు అన్నీ దగ్ధమైపోయాయి. పార్టీ కార్యాలయం గోడపై “నాజీ రిపబ్లికన్ లారా.. ఇప్పటికైనా తక్షణమే వెళ్ళిపొండి లేకుంటే...” అని ఒక హెచ్చరిక వ్రాసి వెళ్ళిపోయారు. 

దీనిపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ “హిల్లరీ క్లింటన్ కి మద్దతు ఇస్తున్న కొన్ని మృగాలు ఈ పని చేశాయి. నేను ఈ ఎన్నికలలో గెలువబోతున్నాననే భయంతోనే ఈ పని చేసినట్లు అనుమానం కలుగుతోంది,” అని ట్వీట్ చేశారు. 

హిల్లరీ క్లింటన్ ఆ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. 

ఈ దాడి రాత్రిపూట జరిగినందున ఆ సమయంలో కార్యాలయంలోపల ఎవరూ లేరు కనుక ప్రాణనష్టం జరుగలేదు. ఈ దాడి డెమొక్రాట్స్, రిపబ్లికన్ పార్టీల మధ్య కొత్త యుద్దానికి దారి తీసింది. 

తమ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ కి విజయావకాశాలున్నందునే తన ప్రత్యర్ధులు అందరూ సిగ్గుపడే విధంగా ఇంత నీచానికి ఒడిగట్టారని విమర్శలు గుప్పిస్తుంటే, ఓటమి అంచున ఉన్న డోనాల్డ్ ట్రంప్, తమ అభ్యర్ధిపై బురద జల్లెందుకే ఈ కుట్రకి పాల్పడి ఉండవచ్చని డెమొక్రాట్స్ అనుమానిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకి కేవలం మరో 22 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇటువంటి సమయంలో ఈ దాడి జరుగడంతో అది తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోనని డెమొక్రాట్స్ ఆందోళన చెందుతున్నారు. ఆరంజ్ కౌంటీ డెమోక్రాట్లకి మంచి పట్టున్న ప్రాంతం కనుక అక్కడ దాడి జరుగడంతో అది డెమొక్రాట్స్ లేదా వారి మద్దతుదారుల పనే అయ్యుంటుందని రిపబ్లికన్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  

“ఈ దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ వంటిది. దోషులని పట్టి చట్టం ముందు నిలబెట్టి తీరుతాను” అని అరేంజ్ కౌంటీ గవర్నర్ మెక్ క్రోరీ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Related Post