ప్రవాస భారతీయులకి ట్రంప్ గాలం?

October 16, 2016
img

డోనాల్డ్ ట్రంప్ గొప్ప బిజినెస్ మ్యాన్ కావచ్చు కానీ అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవి నిర్వహించడానికి కావలసిన లక్షణాలు కనీసం..హుందాతనం కూడా లేవని యావత్ ప్రపంచ దేశాలు, ప్రజలు భావిస్తున్నారు. అసలు అన్ని అవలక్షణాలు కలిగిన వ్యక్తికి అంత అత్యున్నత పదవికి పోటీ పడే అవకాశం రిపబ్లికన్ పార్టీ ఏవిధంగా ఇచ్చిందో, ఆయనని ఇంత కాలం అమెరికన్ ప్రజలు ఏవిధంగా సమర్ధించారో కూడా అర్ధం కాదు.

ఆయన ఒక సగటు భారతీయ రాజకీయ నేత కంటే తక్కువేనని చెప్పక తప్పదు. ఎందుకంటే భారత్ లోని ఎంతటి స్వార్ధ, కపట రాజకీయ నాయకుడికైనా సరే ట్రంప్ కి ఉన్నన్ని అవలక్షణాలు, బలహీనతలు కనబడవు. ట్రంప్ గురించి అమెరికన్ మీడియాలో చెపుతున్న వార్తలని పట్టించుకోనవసరం లేదు. అవి ఆయన ప్రత్యర్ధులు రాజకీయ దురుదేశ్యంతో చేస్తున్న దుష్ప్రచారమే కావచ్చు. కానీ వివిధ అంశాలపై ఆయన వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు, ఆయన వాచాలత్వం, బాడీ లాంగ్వేజ్ మొదలైనవన్నీ తను ఆ పదవికి చేపట్టడానికి ఏవిధంగానూ అర్హుడు కాడని ట్రంప్ నిరూపించుకొంటున్నారు.      

ఎన్నికల బరిలో దిగిన వెంటనే ట్రంప్ చెప్పిన మొట్ట మొదటి మాట భారత్, చైనాలు అమెరికన్ల ఉద్యోగాలు దోచుకొంటున్నాయని..కనుక అమెరికాలో స్థిరపడ్డ భారతీయులతో సహా విదేశీయులందరినీ మెడ పట్టుకొని దేశం బయటకి గెంటేస్తానని! అమెరికాలో కొందరు ప్రవాస భారతీయుల కూడా అటువంటి వ్యక్తి గొప్పగా కనబడుతుండటం విస్మయం కలిగిస్తుంది.

న్యూజెర్సీలో నిన్న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ట్రంప్, భారతదేశం, భారతీయులు, హిందుమతం, ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకి చాల అభిమానమని చెప్పుకొన్నారు. తను అధ్యక్షుడయితే భారత్-అమెరికా సంబంధాలు ఇంకా బలపడతాయని ట్రంప్ చెప్పారు. ఆర్ధిక సంస్కరణల అమలుచేసే విషయంలో   అమెరికా కంటే భారతే ముందుంజలో ఉందని మెచ్చుకొన్నారు. భారత్ ని ప్రధాని నరేంద్ర మోడీ చాలా సమర్ధంగా పరిపాలిస్తున్నారని మెచ్చుకొన్నారు. 

ట్రంప్ పొగడ్తలు అమెరికాలో స్థిరపడ్డ లక్షలాది ప్రవాస భారతీయుల మద్దతు కోసమేనని అర్ధమవుతూనే ఉంది. ఆనాడు భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాల పట్ల, దేశంలో ఉంటున్న వివిధ దేశాల, జాతుల, మతాల ప్రజల పట్ల, అమెరికన్ మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు మాట మర్చి పొగిడినంత మాత్రాన్న వారందరి పట్ల ఆయన అభిప్రాయాలు మారిపోయాయని, ఆయన వ్యక్తిత్వంలో కూడా మార్పు వస్తుందని అనుకొంటే అంతకంటే అవివేకం ఉండబోదు. తాను అమెరికా అధ్యక్షుడైతే ప్రపంచ దేశాలతో ఏవిధంగా వ్యవహరించదలచుకొన్నాడనే విషయం ట్రంప్ మొట్టమొదటే స్పష్టం చేశారు. కనుక అవే ఆయన అనుసరించబోయే విధానాలని భావించవచ్చు. అవి ఎంత ప్రమాదకరమైనవో అందరూ విన్నారు. కనుక అటువంటి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడైతే అమెరికాకే కాదు యావత్ ప్రపంచదేశాలకి సమస్యగా మారే ప్రమాదం ఉంది. కనుక ప్రవాస భారతీయులతో సహా అమెరికన్ పౌరులు కూడా అలోచించి ఓటు వేయడం చాలా మంచిది. 

Related Post