ఏపీ రంజీ టీమ్ కెప్టెన్ హనుమ విహారికి అవమానం

February 27, 2024
img

ఏపీలో ప్రతీ రంగం, ప్రతీ విషయంలో అధికార వైసీపి నేతల జోక్యం పెరిగిపోవడంతో అన్నిటా ‘వైసీపి మార్క్’ స్పష్టంగా కనిపిస్తోంది. రెండు మూడు నెలల క్రితమే వైసీపిలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీ తీరుకి భయపడి వెంటనే రాజీనామా చేసి బయటపడ్డారు. 

తాజాగా ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి కూడా వైసీపి రాజకీయాలకు బలైపోయారు. హనుమ విహారి భారత్‌ తరపున 16 టెస్ట్ మ్యాచులు ఆడారు. ఆంధ్రా రంజీ జట్టుకి ఏడేళ్ళుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అంత సీనియర్ ఆటగాడిపై జట్టులో 17వ ప్లేయర్‌గా ఉన్న తిరుపతి కార్పొరేటర్ కొడుకు ఫిర్యాదు చేయడంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బలవంతంగా రాజీనామా చేయించేసింది. ఈ విషయం హనుమ విహారి స్వయంగా చెప్పారు. 

కార్పొరేటర్ కొడుకుని గ్రౌండ్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని హెచ్చరించినందుకు కెప్టెన్సీ పోగొట్టుకోవలసి వచ్చింది. తాను టీమ్ కెప్టెన్‌గా ఓ ఆటగాడికి చెప్పాల్సినది మాత్రమే చెప్పానని కానీ అసోసియేషన్ తన పట్ల చాలా  అవమానకరంగా వ్యవహరించిందని హనుమ విహారీ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. 

“నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినందున ఇకపై ఆంధ్రా జట్టు తరపున ఎన్నడూ ఆడకూడదని నిర్ణయించుకున్నాను,” అని దానిలో హనుమ విహారి పేర్కొన్నారు. 


Related Post