కామారెడ్డి లెవెల్ క్రాసింగ్ సమస్యకు త్వరలోనే పరిష్కారం

December 12, 2025


img

కామారెడ్డి పట్టణంలో స్నేహపూరి, వికాస్ నగర్‌ తదితర ప్రాంతాలు నిత్యం వాహనాల రాకపోకలతో చాలా రద్దీగా ఉంటాయి. ఈ ట్రాఫిక్ సమస్యని అక్కడ ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ ఇంకా పెద్దది చేస్తుంటుంది. నిత్యం ఆ మార్గంలో అనేక ప్యాసింజర్, గూడ్స్ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి. కనుక తరచూ గేట్ పడుతూనే ఉంటుంది. 

కనుక అక్కడ ఓ రోడ్ ఓవర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలని స్థానిక ప్రజలు చాలా కాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలను కోరుతూనే ఉన్నారు. కానీ తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళు గడిచినా ఇంతవరకు ఒక చిన్న రైల్వే బ్రిడ్జ్ నిర్మించలేకపోయారు. 

ఇటీవల ఢిల్లీ వెళ్ళిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నేరుగా రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్‌ని కలిసి ఈ సమస్య గురించి వివరించారు. కామారెడ్డి పట్టణంలో ఓ రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలనే ఆయన అభ్యర్ధనపై రైల్వే మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. దీని నిర్మాణానికి తక్షణమే రైల్వేలో సంబంధిత అధికారులకు ఆదేశం జారీ చేశారు.

రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టి పూర్తి చేసే వరకు తాను రైల్వే అధికారుల వెంటపడుతూనే ఉంటానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెప్పారు.                  



Related Post