తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ కదలిక మొదలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ ఇంటలిజన్స్ అధినేత ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు లొంగిపోయారు.
ఆయనని వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఆయనని కొట్టడం, తిట్టడం వంటి పనులు చేయరాదని సుప్రీంకోర్టు ముందే హెచ్చరించింది. కనుక సిట్ అధికారులు ఆయనని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ప్రభాకర్ రావు కూడా పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్ అయినవారే. గతంలో అనేక మందిని స్వయంగా విచారణ జరిపారు. కానీ ఈ కేసులో నిందితుడుగా ఉన్న అయన సిట్ అధికారులకు విచారణలో సహకరించడం లేదు. అందువల్లే సుప్రీంకోర్టు ఆయన కస్టడీకి అనుమతించింది. కనుక ఇప్పుడైనా సిట్ అధికారులకు సహకరిస్తారో లేదో.. ఒకవేళ సహకరించకపోతే ఏం చేస్తారో?