తెలంగాణలో ఇక సినిమా టికెట్ ఛార్జీలు పెంపు ఉండదు!

December 13, 2025


img

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ఛార్జీలు పెంపు ఉండదు. కనుక టికెట్ ఛార్జీలు పెంచమని కోరుతూ నిర్మాతల దరఖాస్తులు స్వీకరించబోము,” అని స్పష్టం చేశారు. దీనిపై సామాన్య ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బడ్జెట్‌ సినిమాలంటూ అడ్డుగోలుగా టికెట్ ఛార్జీలు పెంచుకోవడానికి ప్రభుత్వమే అనుమతిస్తుండటం సరికాదని చాలా కాలం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. 

గత ఏడాది డిసెంబర్‌లో అల్లు అర్జున్‌ నటించిన పుష్పా-2 విడుదలైనప్పుడు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట తదనంతర పరిణామాలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఇక సినిమా టికెట్ ఛార్జీలు పెంపు ఉండదని ప్రకటించారు. హైకోర్టు కూడా టికెట్ ఛార్జీల పెంపుని తప్పు పట్టింది. కానీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలకు టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించడం మొదలుపెట్టింది. అఖండ-2 విషయంలో వివాదం ఏర్పడటంతో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించి ఇకపై ఇక సినిమా టికెట్ ఛార్జీలు పెంపుని అనుమతించరాదనీ నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో త్వరలో విడుదల కాబోతున్న ప్రభాస్‌ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ తదితర పెద్ద సినిమాలు భారీ రాబడి కోల్పోతాయి. కానీ బడ్జెట్‌ భారం ప్రేక్షకుల మీద వేయకుండా నటీనటులు, సాంకేతిక నిపుణుల తమ పారితోషికాలు తగ్గించుకొని ఉపశమనం కల్పించవచ్చు కదా? 


Related Post

సినిమా స‌మీక్ష