ఇది పంచాయితీ ఎన్నికలా... శాసనసభ ఎన్నికలా?

December 11, 2025


img

తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. నేడు 4,236 గ్రామ పంచాయితీల సర్పంచ్‌లను, 37,440 మంది వార్డు సభ్యులను ఎన్నుకుంటారు. 

వీటిలో 5 సర్పంచ్‌ పదవులకు, 169 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్స్ దాఖలు కాలేదు. కనుక వాటికి నేడు ఎన్నికలు జరుగవు. 

ఇక 369 సర్పంచ్‌, 9,633 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ సర్పంచ్‌, 10 వార్డు సభ్యుల ఎన్నికపై వివాదం ఏర్పడటంతో హైకోర్టు స్టే విధించింది. 

కనుక మిగిలిన 3,834 సర్పంచ్‌,  27,628 వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. 

ఈ 3,834 సర్పంచ్‌ పదవులకు 12,960 మంది పోటీ పడుతుండగా 27,628 వార్డు సభ్యుల పదవులకు 65,455 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

గ్రామస్థాయి ఎన్నికలలో ఇంత భారీగా నామినేషన్స్, అభ్యర్ధుల ప్రచారం, లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్స్ వగైరా అందిస్తుండటం వంటివి చూస్తున్నప్పుడు ఇది పంచాయితీ ఎన్నికలా లేక శాసనసభ ఎన్నికలా?అని సందేహం కలుగుతుంది. 

అభ్యర్ధులు ఇంత భారీగా ప్రచారం, ఖర్చు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఎన్నికలతో రాజకీయ పార్టీలు పాల్గొనవు. కానీ వాటి మద్దతుదారులే పోటీ పడుతున్నారు. పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాజకీయ పార్టీలు చేసే గెలుపు ప్రకటనలు ఈ ఎన్నికల వెనుక అవున్నాయని స్పష్టం చేస్తాయి. కనుక అభ్యర్ధులకు వారికి ఆయా పార్టీల అండదండలు లభిస్తున్నందునే ఇంత విచ్చలవిడిగా ఖర్చు చేయగలుగుతున్నారని భావించవచ్చు. 

ఏది ఏమైనప్పటికీ తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికలు శాసనసభ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా జరుగుతున్నాయి. 


Related Post