గురువారం జరిగిన తొలిదశ గ్రామ పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లు సాధించి మరోసారి తన సత్తా చాటుకుంది. మొత్తం 3,834 సర్పంచ్ పదవులలో 2,383 పదవులు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంతగా బలహీనపడినా అది కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా 1,146 సర్పంచ్ పదవులు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. పంచాయితీ ఎన్నికలలో బీజేపీ కంటే స్వాతంత్ర్య అభ్యర్ధులు ఎక్కువ మంది గెలిచారు. మొత్తం 455 మంది సర్పంచ్‌లుగా ఎన్నికవగా వారిలో సీపీఎంకి చెందినవారు 14 మంది, సీపీఐ 16 మంది ఉన్నారు. తెలంగాణలో ఎప్పటికైనా అధికారంలోకి రావాలని తహత్యహలాడుతున్న బీజేపీ 200లలోపు సీట్లు గెలుచుకొని నాలుగో స్థానంలో నిలిచింది.
మొదటి దశ పంచాయితీ ఎన్నికలలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో అత్యల్పంగా 71.29 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో 193 మండలాలలోని 4,333 గ్రామాలు, 38,350 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
ఈ నెల 17న మూడో విడతలో 182 మండలాలలోని 4,159 గ్రామాలు, 36,452 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో 31 జిల్లాలలో 1,66,55,186 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 81,42,231మంది మహిళలు 85,12,455 ఇతరులు 500 మంది ఉన్నారు.