ఏపీ డెప్యూటీ సిఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు పోస్టులు పెడుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుని అభ్యర్ధించారు.
ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన తరపు న్యాయవాది అందించిన జాబితాలోని వ్యక్తులు, సంస్థలకు ఆ పోస్టులను తొలగించేందుకు వారం రోజులు సమయం ఇచ్చింది. ఆ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
ఇదివరకు నాగార్జున, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి పలువురు ప్రముఖులు ఇదేవిధంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులను తొలగింపజేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ డెప్యూటీ సిఎం, మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కనుక ఆయన రాజకీయ ప్రత్యర్ధులు, వారి మద్దతుదారులు కూడా తరచూ అయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు.
తాజాగా ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి ఆయనకు ఓ మతం లేదు. ఓ సిద్దాంతం లేదు. ఓ నమ్మకం లేదు. రోజుకో మాట మాట్లాడుతారంటూ ఎద్దేవా చేస్తూ ఆయన తల్లితండ్రులు, కుటుంబం గురించి చాలా అనుచితంగా మాట్లాడటమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇలా ఆయన గురించి అనుచితంగా మాట్లాడేవారు చాలా మందే ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది.