ఆకాశంలో ఎగిరే కారు రోడ్డుపై వెళ్ళే కారుని ఎలా ఢీ కొడుతుంది? అనే సందేహం కలుగవచ్చు. కానీ ఇది వాస్తవం. అమెరికాలో ఫ్లోరీడా రాష్ట్రంలో బ్రేవార్డ్ కౌంటీ ఇంటర్ స్టేట్-95 వద్ద రోడ్డుపై వెళుతున్న ఓ కారుని చిన్న విమానం ఢీ కొట్టింది. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలట్ విమానాన్ని నియంత్రించలేకపోయాడు.
దాంతో విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అదుపు తప్పి కారుని వెనుక నుంచి ఢీ కొట్టింది. దాంతో కారు వెనుక భాగం, విమానం ముందు భాగం దెబ్బ తిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న 59 ఏళ్ళ మహిళకు, పైలట్‌కి స్వల్పంగా గాయాలయ్యాయి.
రోడ్డుపై కారు-విమాన ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిగా అక్కడకు చేరుకొని వాటిని అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. విమాన ప్రమాదంపై సంబంధిత అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.