హైదరాబాద్, అమీర్‌పేట్ వద్ద ఓ కోచింగ్ సెంటరులో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం కాంప్లెక్స్‌లోని శివం టెక్నాలజీస్‌లో ఇన్వర్టర్ బ్యాటరీలు వేడెక్కి పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి.
విద్యార్ధులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.
ఈ అగ్నిప్రమాదంలో కోచింగ్ సెంటరులో ఫర్నీచర్, అనేక కంప్యూటర్లు అగ్నికి ఆహుతవడంతో ఆస్తి నష్టం ఎక్కువే ఉందని నిర్వాహకులు చెపుతున్నారు.
ఈరోజు ఈ అగ్నిప్రమాదం నుంచి విద్యార్ధులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు కనుక ఇది పెద్ద వార్త కాకపోవచ్చు. కానీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే అప్పుడు అందరూ ప్రభుత్వాన్నే వేలెత్తి చూపి విమర్శిస్తారు కదా?
కనుక చేతులు కాలక ఆకులు పట్టుకోవడం కంటే ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించి అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయడం మంచిది.
హైదరాబాద్ నడిబొడ్డున గల అమీర్‌పేట్ వద్ద మైత్రీవనంకాంప్లెక్స్‌లోనే అనేక కోచింగ్ సెంటర్లున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలలో గల భవనాలలో ఇంకా అనేకం ఉన్నాయి. తెలంగాణ పోలీస్, ప్రభుత్వోద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్ వస్తుంటారు. వారిలో నగరంలో ఇలాంటి పలు కోచింగ్ సెంటర్లలో చేరి శిక్షణ పొందుతుంటారు.
శిక్షణ పొందినవారందరికీ ఉద్యోగాలు లభిస్తాయనే గ్యారెంటీ ఉండదు. కానీ ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగితే వారి ప్రాణాలకే చాలా ప్రమాదం.
ఒకే భవనంలో డజన్ల కొద్దీ కోచింగ్ సెంటర్లు, వాటిలో వందల మంది విద్యార్ధులు ఉంటారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అందరూ ఒకేసారి బయటకు పరుగులు తీస్తుంటారు. కనుక అగ్నిప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడేందుకు వేరేగా మెట్ల మార్గం చాలా అవసరం. కానీ ఎక్కడా ఉండదు.
కనీసం భవనంలో, కోచింగ్ సెంటర్లలో అగ్నిప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు ఎటువంటి పరికరాలు అందుబాటులో ఉండవు. కనుక సంబంధిత శాఖలు తప్పనిసరిగా నిబంధనలు అమలుచేసేలా చూడాలి.