సముద్ర తీరానికి దూరంగా ఉన్న హైదరాబాద్‌లో బీచ్ ఉంటుందా? అంటే ఉండదనే చెప్తాము. కానీ ఉంటుంది. రూ.235 కోట్ల పెట్టుబడితో కృత్రిమ బీచ్ ఏర్పాటు కాబోతోంది. హైదరాబాద్, అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో కోత్వాల్ గూడ వద్ద 35 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటుకాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి డిజైనింగ్, ప్లానింగ్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తికాగానే పనులు మొదలవుతాయి.
దీనిలో సముద్రంలో లాగే పుష్కలంగా నీళ్ళు, వాటికి కెరటాలు కూడా ఉంటాయి. ఒడ్డున ఇసుకతో నింపి బీచ్‌లా తీర్చిదిద్దుతారు. అలాగే ఈ కృత్రిమ బీచ్‌లో స్పీడ్ బోట్ రైడింగ్, డైవింగ్, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
దుబాయ్, సింగపూర్‌లో మాదిరిగానే భారీ గ్లాస్ సొరంగం (టన్నల్ ఎక్వేరియం) కూడా ఏర్పాటు చేస్తారు. బీచ్ అంటే పర్యాటకులకు సకల సౌకర్యాలు ఉండాలి. కనుక విలాసవంతమైన హోటల్స్, దేశవిదేశాలకు చెందిన వంటకాల వడ్డించే రెస్టారెంట్స్, షాపింగ్ మాల్, సినిమా హాల్స్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, పార్కులు వగైరా కూడా ఉంటాయి.
ఇది హైదరాబాద్ నగర శివారులో ఉంటుంది కనుక నగర ప్రజలకు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. సినిమా షూటింగ్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. మరో రెండేళ్ళలో నిర్మాణ పనులు పూర్తిచేసుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.