అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో స్థిరపడిన భారత్ కి చెందిన వ్యక్తులకి బాగానే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంతకు ముందు నిక్కి హెలీ అనే ఇండో-అమెరికన్ మహిళని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించిన ట్రంప్, తరువాత సీమా వర్మ అనే ఇండో-అమెరికన్ కి తన ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టారు. అమెరికా ఆరోగ్య మంత్రిత్వశాఖ అధీనంలో నడిచే సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసస్ కి సీమా వర్మని ఇన్-చార్జ్ గా నియమించారు.
ఆమె యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్, కాలేజ్ పార్క్ నుంచి 1993లో లైఫ్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన తరువాత జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి 1996లో పబ్లిక్ హెల్త్-పాలసీ అండ్ మేనేజిమెంట్ అనే సబ్జెక్ట్ లో మాష్టర్స్ డిగ్రీ చేశారు.
ఆమె హెల్త్ అండ్ హాస్పిటల్ కార్పోరేషన్ ఆఫ్ మారియన్ కంట్రీలో ప్రణాళికా విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా, అసోసియేషన్ అండ్ టెర్రీటోరియల్ హెల్త్ అఫిసియల్స్ , వాషింగ్టన్-డిసిలో పనిచేశారు. ఆ తరువాత ఆమె స్వయంగా ఆరోగ్యపాలసీలని అందించే ఎస్.వి.సి.ఇంక్ అనే సంస్థని 2001లో స్థాపించారు. దానికి ఆమె సి.ఈ.ఓ. మరియు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ అమెరికా ప్రభుత్వంతో కలిసి ఇండియానా, కెంటకీ, లోవ, మిచిగాన్, ఒహియో,మెయినీ, టెన్నిస్సీ ప్రాంతాలలో పనిచేసింది. ఒబామా హెల్త్ కేర్ లోని ఇండియానా-2.0 గా ప్రసిద్ధి చెందిన మెడికైడ్ ఎక్స్ పాన్షన్ పధకాన్ని సీమావర్మే రూపొందించారు.
దేశంలో సామాన్య ప్రజలకి కూడా వైద్య భీమా సౌకర్యం కల్పించడానికి ఆమె రూపొందించిన పధకాలు అందరి దృష్టిని ఆకట్టుకొన్నాయి. సామాన్య ప్రజలకి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకు రావడానికి ఆమె చేసిన కృషిని గుర్తించిన డోనాల్డ్ ట్రంప్ ఆమెని ఈ కీలక పదవికి ఎంపిక చేశారు. అందుకు ఆమె చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. హెల్త్ కేర్ రంగంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కోసం తను ఇంకా కృషి చేస్తానని సీమావర్మ చెప్పారు.