అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల జారీపై విధించిన ఆంక్షలతో భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ పట్టించుకుంటే ఆయన ‘ట్రంప్’ ఎందుకవుతారు?
అమెరికాలో కొన్ని లక్షల మంది హెచ్-1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వారి జీవిత భాగస్వాములు కూడా ఈఏడీ ద్వారా అనుమతి తీసుకొని ఉద్యోగాలు చేస్తుంటారు. అమెరికాలో భార్యా లేదా భర్త ఒక్కరి జీతం మీద కుటుంబం పోషణ చాలా కష్టం.
కనుక విద్యార్హతలను బట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఏవో ఉద్యోగాలు చేస్తుంటారు. జీవిత భాగస్వాములు తమ వీసాలు రెన్యువల్ చేయించుకున్నప్పుడు, ఇంతకాలం ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ‘ఈఏడీ’ వర్క్ పర్మిట్ కూడా ఆటోమేటిక్‌గా 18 నెలలకు రెన్యువల్ అయిపోతుండేది.
ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఈఏడీ ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని నిలిపివేసింది. ఈ మేరకు యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ప్రకటన జారీ చేసింది. ఈ విధానం నేటి నుంచే (అక్టోబర్ 30) అమలులోకి వస్తుందని ప్రకటించింది.
ఇక మీదట ఈఏడీ వర్క్ పర్మిట్ కోసం ప్రతీసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దరఖాస్తులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
ఈఏడీ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా పెద్ద ప్రక్రియ. కనుక హెచ్-1బీ వీసాల జీవిత భాగస్వాములు ఈఏడీ వర్క్ పర్మిట్ లభించకపోతే ఇకపై అమెరికాలో ఉద్యోగాలు చేయలేరు. కనుక ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయం వారందరిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.