 
                                        సంగారెడ్డి జిల్లా, సుల్తాన్ పూర్ జేఎన్‌టియూహెచ్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న మహేందర్ (24) అనే విద్యార్ధి శుక్రవారం హాస్టల్ గదిలో ఫ్యానుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతను సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని సిరికొండ గ్రామపరిధిలో తండాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. మహేందర్ మూడు రోజులుగా కాలేజీకి వెళ్ళకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. ఈరోజు కూడా కాలేజీకి రాకపోవడంతో రూమ్మేట్స్ కాలేజీకి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత తలుపులు మూసేసి ఫ్యానుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తలుపులు మూసి ఉండటంతో అతను ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయం ఎవరికీ తెలియలేదు. అతని రూమ్మేట్స్ మధ్యాహ్నం కాలేజీ నుంచి తిరిగి వచ్చి చూస్తే మహేందర్ ఫ్యానుకి నిర్జీవంగా వ్రేలాడుతూ కనిపించాడు. వారు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మహేందర్ చేతిలో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. కానీ దానిలో అతను ఏమి వ్రాశాడదనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.
ఈ విషయం మహేందర్ తల్లితండ్రులు అక్కడకు చేరుకొని చేతికి అందివస్తాడను చెట్టంత కొడుకు అర్ధంతరంగా ప్రాణం తీసుకున్నాడంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే అందరూ కంట తడి పెట్టారు.