పంట నష్ట పరిహారం: ఎకరానికి 10,000

October 31, 2025


img

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మొంథ తుఫాను వలన 12 జిల్లాలలో మొక్కజొన్న, పత్తి, వరి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఎకరానికి రూ. 10,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై సుదీర్గంగా చర్చించిన తర్వాత ఈనిర్ణయం తీసుకున్నారు. తుఫానులో మరణించిన కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించారు. అలాగే వరద ముంపు గురైన ఇళ్ళకు ఒక్కో కుటుంబానికి రూ.15,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. 

తుఫాను ధాటికి అనేక పూరి గుడిసెలు కొట్టుకుపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తుఫానులో ఆవులు, గేదెలు చనిపోతే రూ.50,000, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వీలైనంత త్వరగా బాధిత కుటుంబాలను, పంట నష్టం గుర్తించి జిల్లా కలెక్టర్లకు నివేదికలు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ నివేధికలను కేంద్ర ప్రభుత్వానికి పంపి సాయం కోరుదామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.           



Related Post