ఈసీకి చేరిన అజారుద్దీన్ పంచాయితీ

October 30, 2025


img

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మహ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి ప్రకటించి రేపు ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్దమవుతోంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈవిదంగా ఉప ఎన్నికలకు ముందు ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తోందని బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశాయి. 

ఈవిదంగా చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమని కనుక తక్షణం చర్య తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చాయి. వాటిని స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై అభిప్రాయం తెలుపవలసిందిగా కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ వ్రాసింది. 

అయితే మంత్రివర్గంలో కొత్త మంత్రులను నియమించుకోవడానికి ముఖ్యమంత్రికి హక్కు, అధికారం ఉంటుంది. అది రాజ్యాంగ విరుద్దం కాదు. ఈ నియామకానికి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి తదితరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందిగ్దత ఉన్నందునే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీకి లేఖ వ్రాసింది. 

ఒకవేళ రేపు ఉదయం 11 గంటలలోపుగా జవాబు రాకపోతే మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ఈసీ తక్షణమే స్పందించి అభ్యంతరం చెపితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 

ఈ విషయం జూబ్లీహిల్స్‌లోని ముస్లిం ఓటర్లకు అర్దమైంది కనుక రేపు అయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా చేయకపోయినా వారు ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. 


Related Post