మాజీ సిఎం కేసీఆర్ అద్భుతమైన ఎన్నికల వ్యూహ నిపుణుడుగా మంచి పేరుంది. కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఆయన వ్యూహాలను చిత్తుచిత్తు చేసి ఆయన కంటే ఘనుడనిపించుకున్నారు.
ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 3-6 నెలల్లో కుప్ప కూలిపోతుందని బీఆర్ఎస్ పార్టీ ఆశపడింది. కానీ సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ మరింత ఐఖ్యపరిచి త్వరలో రెండేళ్ళ పాలన పూర్తి చేసుకోబోతున్నారు.
పైగా బీఆర్ఎస్ పార్టీలో నుంచే 10 మంది ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించి ఆ పార్టీని చావు దెబ్బ తీశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆశపడింది. కానీ ఇప్పుదు కూడా సిఎం రేవంత్ రెడ్డి తన అద్భుతమైన వ్యూహాలతో దానిని ఎన్నికలకు ముందే సగం ఓడించేశారు.
ముందుగా ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఉబలాటపడిన మహ్మద్ అజరుద్దీన్‌కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇప్పించి రేసులో నుంచి తప్పించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 60,000 మంది ముస్లిం ఓటర్లు ఉండగా ఆయనని బరిలో తప్పించడంతో బీఆర్ఎస్ పార్టీ చాలా సంతోషించింది. ఇక తమ గెలుపు ఖాయమని నమ్మకం ఏర్పడింది.
కానీ అది ఊహించలేని విధంగా మజ్లీస్ పార్టీతో బలమైన సంబంధాలున్న నవీన్ యాదవ్‌ని అభ్యర్ధిగా ప్రకటించి మొదటి షాక్ ఇచ్చారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చి నియోజకవర్గంలో ముస్లింలందరూ ఆయనకే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఊహించిందే కనుక తేరుకొని నవీన్ యాదవ్, ఆయన తండ్రి రౌడీయిజం గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టింది.
కానీ సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరో పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో మహ్మద్ అజరుద్దీన్‌కి మంత్రి పదవి కట్టబెడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టు కలిగి ఉన్న మహ్మద్ అజరుద్దీన్ రేపటి నుంచి మంత్రి హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే నియోజకవర్గంలో ముస్లింలు ఏవిదంగా స్పందిస్తారో తేలికగానే ఊహించవచ్చు.
ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ముస్లిం ఓటు కూడా పడకుండా చెక్ పెట్టారని చెప్పవచ్చు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి భార్య సునీతని బరిలో దింపి సానుభూతి ఓట్లతో గెలిచేయవచ్చని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సైతం ఊహించని విదంగా సిఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ సగం ఓడించేశారని భావించవచ్చు.