మొంథా తుఫాను: దిశ మార్చుకొని తెలంగాణలో విధ్వంసం

October 30, 2025
img

వరుణదేవుడు తెలంగాణ రాష్ట్రంపై పగ బట్టాడా?అన్నట్లుగా దాదాపు రెండు నెలలుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాటితో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతూనే ఉంది. ఇప్పుడు మొంథా తుఫాను విరుచుకుపడి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, మహబూబ్ నగర్‌ జిల్లాలలో విధ్వంసం సృష్టించింది. వాస్తవానికి ఏపీ నుంచి ఛత్తిస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాలవైపు సాగిపోవాల్సిన మొంథా తుఫాను క్రమంగా దిశ మార్చుకొని తెలంగాణపైకి దూసుకు వచ్చి విధ్వంసం సృష్టించింది. 

మొంథా తుఫాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి కుండపోతగా వాన కురవడంతో వాగులు పొంగిపొర్లాయి. ఊర్లు జలమయ్యాయి. చేతికి అందివచ్చిన పత్తి, మక్కల పంటలు నీట మునిగాయి. అనేక ప్రాంతాలలో రోడ్లు కొట్టుకుపోయాయి. పలు రైల్వే స్టేషన్‌ స్టేషన్లలో పట్టాలపై మోకాలు లోతు నీరు చేరడం ఎక్కడి రైళ్ళు అక్కడ నిలిచిపోయాయి. మొంథా తుఫాను చేసిన నష్టం అంతా ఇంతా కాదు.

హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో 41.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా వరంగల్‌ జిల్లాలో పర్వతగిరి మండలంలో కల్లెడలో 34.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైయ్యింది. ఈ స్థాయిలో కుండపోతగా వర్షం కురియడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. 

గురువారం సాయంత్రానికి మొంథా తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారి ఛత్తిస్‌ఘడ్‌ వైపు సాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కనుక నేటికీ ఈ వాయు గుండం ప్రభావం ఉంటుంది కనుక రాష్ట్రంలో పలు జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి.   


Related Post