డోనాల్డ్ ట్రంప్ జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా భాద్యతలు చేపట్టగానే మొదటి రోజునే హెచ్-1బి వీసాల జారీ విధానాన్ని పునసమీక్షించబోతున్నట్లు మొన్న సోమవారం మళ్ళీ బలమైన సంకేతాలు ఇచ్చారు. లోపభూయిష్టమైన దాని వలన దేశంలో లక్షలాది అమెరికన్ యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా వాటిని కోల్పోతున్నారని ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ జీతాలకి పనిచేసే విదేశీ ఉద్యోగుల వలన, విదేశాలలోని అవుట్ సోర్సింగ్ సంస్థల వలన అమెరికన్ యువతకి తీరని అన్యాయం జరుగుతోందని ట్రంప్ వాదించారు. అందుకే తను అధ్యక్షుడుగా ఎన్నికైతే మొట్టమొదట హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియని పునసమీక్షిస్తానని, అమెరికన్ యువతకే మొదట ఉద్యోగాలు దక్కేవిధంగా విధానాలు మారుస్తానని చెప్పారు. అదే విషయం మళ్ళీ సోమవారం కూడా చెప్పడంత్ దానిపై ట్రంప్ ఇంక వెనకడుగు వేయబోరని స్పష్టం అయ్యింది. తను అమెరికా అధ్యక్షుడుగా జనవరిలో బాధ్యతలు చేపట్టగానే 5 అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు చెప్పారు.
అవి:
1. హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియని పునసమీక్షించడం. దాని అమలులో కార్మికశాఖలో ఇంతవరకు జరిగిన ఉల్లంఘనలపై విచారణకి ఆదేశించడం.
2. అవుట్ సోర్సింగ్ విధానంపై పునః సమీక్ష.
3. విద్యుత్ మరియు ఇతర ఉత్పత్తి రంగాలలో అమెరికన్ యువతకి ఉద్యోగాలు కోల్పోవడానికి లేదా దక్కకుండా అవరోధంగా మారిని నిబంధనలని తొలగించడం.
4. అమెరికాకి పెనుభారంగా మారిన ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలగడం.
5. దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థని మరింత కట్టుదిట్టం చేసేందుకు తగిన విధానాల రూపకల్పనకి మార్గదర్శకాలు జారీ చేయడం.
డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఈ అంశాల కోసం వేర్వేరు నిపుణులతో కూడిన కమిటీలని ఏర్పాటుచేసి వాటిపై నిర్దిష్టమైన విధివిధానాలని రూపొందించే బాద్యత అప్పగించింది. జనవరిలోగా వాటి నివేదికలు కూడా సిద్దం అవుతాయి కనుక ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా భాధ్యతలు చేపట్టగానే తక్షణమే ఈ 5 అంశాలపై తన నిర్ణయాలు అమలుచేయడం మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
దీని వలన అమెరికాలో స్థిరపడిన భారతీయులుపై, అమెరికా సంస్థలకి భరత్ నుంచి అవుట్ సోర్సింగ్ పద్దతిలో సేవలు అందిస్తున్న సంస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. అదేవిధంగా అమెరికా ఉన్నత విద్యలభ్యసిస్తూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొనే విద్యార్ధులకి, విద్యాభ్యాసం పూర్తిచేసి అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొంటున్న విదేశీ యువతకి కూడా ఇక ఆ అవకాశం ఉండకపోవచ్చు. కనుక ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు భారత ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు.