అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో వివేక్ రామస్వామి

August 25, 2023
img

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024, నవంబర్‌ 5వ తేదీన జరుగుతాయి. అయితే అమెరికాలో అధ్యక్షుడిని ప్రజలే నేరుగా ఎన్నుకొంటారు. కనుక ఎన్నికలకు సుమారు ఏడాదిన్నర ముందే రెండు ప్రధాన పార్టీలు డెమొక్రాట్స్, రిపబ్లికన్స్ తమ తమ అభ్యర్ధులను ఎంపిక చేసి, వివిద అంశాలపై వారి మద్య బహిరంగ చర్చలు నిర్వహిస్తాయి.

ఆ చర్చలలో అత్యుత్తమంగా నిలిచినవారు, మళ్ళీ తమ ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధితో బహిరంగ చర్చలో పాల్గొని వివిద అంశాలపై తమ వైఖరిని వివరిస్తూ ప్రత్యర్ధి కంటే తమ వైఖరి మేలని ప్రజలను మెప్పించాల్సి ఉంటుంది. 

ఆ విధంగా మొదలైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధుల బహిరంగ చర్చలో ఈసారి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సహా మొత్తం 8 మంది పోటీ పడుతున్నారు. బుదవారం వాషింగ్‌టన్‌లో జరిగిన ఈ చర్చలో ఆరుగురు అభ్యర్ధులు మాత్రమే పాల్గొన్నారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందినవారు ఉండటం, ఆరుగురు సభ్యులలో వివేక్ రామస్వామి పైచేయి సాధించడం విశేషం. 

తొలి రౌండ్ చర్చలో ఉక్రెయిన్‌కు అమెరికా యుద్ధసాయం చేయడం గురించి జరుగగా, దానిలో నిక్కీ హేలీ ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా ఉండాలని వాదించగా, అమెరికా భద్రత కంటే ఉక్రెయిన్‌కు సాయపడటం ముఖ్యం కాదని వివేక్‌ రామస్వామి గట్టిగా వాదించారు. ఇతర దేశాల కోసం ఇంకా ఎంతకాలం అమెరికా సైనికుల ప్రాణాలు బలి ఇవ్వాలని, అమెరికా ప్రజల కష్టార్జితంతో ఇతర దేశాలను ఎంతకాలం కాపాడాలని వివేక్‌ రామస్వామి ప్రశ్నించారు. అమెరికా సైనికులు, ఆయుధ సంపత్తి, వారి త్యాగాలు అన్నీ అమెరికా కోసమే తప్ప ఇతర దేశాల కోసం కాదని వాదించారు. ఈ విషయంలో తాను కూడా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాన్నే అనుసరిస్తానని విస్పష్టంగా ప్రకటించారు. 

వివేక్‌ రామస్వామి తన వాదనలో తొలి రౌండ్‌లో మిగిలిన అభ్యర్ధులపై స్పష్టమైన ఆధిఖ్యత సాధించారు. దేశవ్యాప్తంగా మీడియా నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో వివేక్‌ రామస్వామికి 28 శాతం, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్ డిసాంటిస్‌కు 27 శాతంమ మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు 13 శాతం, నిక్కీ హెలీకి కేవలం 7 శాతం ప్రజలు మద్దతు పలికారు. ఈ చర్చల తర్వాత వారికి మద్దతు పలికేవారు విరాళాలు కూడా అందిస్తుంటారు. వివేక్‌ రామస్వామికి అందరి కంటే అత్యధికంగా 4.5 లక్షల డాలర్లు (రూ.3.7 కోట్లు) విరాళాలు అందిన్నట్లు రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది.

Related Post