తెలంగాణ రాష్ట్రానికి చెందిన 20 మందికి పైగా కార్మికులు ఇరాక్‌లో అష్టకష్టాలు పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళేందుకు పాస్ పోర్ట్, వీసా, వర్క్ పర్మిట్లు ఎంత అవసరమో ఆ దేశాలలో నివాస గుర్తింపు కార్డు ‘అకామా’ కూడా అంతే అవసరం. తప్పనిసరి! సాధారణంగా ఉద్యోగుల అకామా గడువు ముగిసేలోగానే వారికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థలు లేదా వ్యక్తులు వాటిని రెన్యూవల్ చేయిస్తుంటారు. కొన్నిసార్లు ఏకారణం చేతైనా వారు రెన్యూవల్ చేయకపోవడమో లేదా కార్మికులే వేరే చోట పని వెతుకొనేందుకు వెళ్లినప్పుడు రెన్యూవల్ చేయించుకోలేకపోవడమో జరుగుతుంటుంది. అప్పుడే వారి కష్టాలు మొదలవుతాయి.
అకామా లేకపోతే వారికి ఎవరూ పని, ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగం లేకపోతే ఆదాయం ఉండదు. కనుక అకామా రెన్యూవల్ చేయించుకోలేరు. అప్పుడు చట్టప్రకారం వారు అనుమతి లేకుండా గల్ఫ్ దేశాలలో అక్రమంగా నివశిస్తున్నవారిగా పరిగణించి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంటారు.
కొంతకాలం క్రితం ఇరాక్‌లో ఇలాగే అనేకవేలమంది భారత్‌కు చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతుంటే, ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాక్ ప్రభుత్వంతో మాట్లాడి వారందరికీ శిక్షలు, జరిమానాలు విధించకుండా స్వదేశం వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ ఆ తర్వాత కూడా ఇరాక్‌లో అనేకమంది కార్మికులు ఉండిపోయారు. వారిలో తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 20మందికి పైగా కార్మికులున్నారు.
అకామా లేనివారు ఒక్కొక్కరు దాదాపు లక్ష రూపాయలు జరిమానా చెల్లించి స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాలని ఇరాక్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉద్యోగం, ఆదాయం, కనీసం ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండి కూడా లేని పరిస్థితులలో ఉన్న తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడితే ఏళ్ళతరబడి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందనే భయంతో పార్కులలో, స్నేహితుల ఇళ్ళలో దొంగచాటుగా బ్రతుకుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నామని వారు ఫోన్లు చేసి తమ కుటుంబసభ్యులకు చెపుతుంటే ఇక్కడ వారు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వమే తమ వారిని ఆదుకొని స్వదేశానికి తిరిగి రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాక్‌లోని ప్రవాసీ మిత్ర సంస్థ భారత విదేశాంగ శాఖతో వారి గురించి సంప్రదింపులు జరుపుతోంది.