అమెరికాలో వీరసింహారెడ్డి ప్రేక్షకులకి క్లాసు పీకిన పోలీసులు

January 12, 2023
img

నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్‌ జంటగా నటించిన వీరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. అమెరికాలో బాలయ్య అభిమానులు థియేటర్ల బయట, లోపల చేసిన సందడి అంతా ఇంతా కాదు. అది ఏ స్థాయిలో ఉందంటే సినిమా మద్యలో నిలిపివేసి పోలీసులు రంగప్రవేశం చేసి వార్నింగ్ ఇచ్చేంత! 

ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలలో తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్‌లలో ప్రదర్శిస్తునప్పుడు అభిమానులు ఈలలు, కేకలు వేస్తూ, కాగితం ముక్కలని గాలిలో ఎగురవేస్తూ హడావుడి చేస్తుంటారు. ఈరోజు అమెరికాలో ఓ థియేటర్‌లో కూడా బాలయ్య అభిమానులు ఇలాగే రెచ్చిపోయారు. వారు చేస్తున్న ఈ హడావుడి చూసి థియేటర్‌ మేనేజర్ పోలీసులకు ఫోన్‌ చేసి పిలిపించారు. వెంటనే ఇద్దరు పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని సినిమా ప్రదర్శన మద్యలో నిలిపివేయించి, బాలయ్య అభిమానులను గట్టిగా మందలించారు. సినిమా చూసి ఆనందించవచ్చు కానీ ఇలా అల్లరిచేస్తూ థియేటర్‌లో కాగితం ముక్కలు చించిపోయడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఈ థియేటర్‌లో చాలా సినిమాలు ప్రదర్శించబడ్డాయి కానీ ఏనాడూ ఈవిదంగా జరగలేదన్నారు. మీరు ఈవిదంగా చేయడం సరికాదు. థియేటర్‌లోని మీరు పోసిన ఈ చెత్తని శుభ్రం చేయవలసి ఉంటుంది కనుక అందరూ దయచేసి బయటకి వెళ్ళండి,” అంటూ అందరినీ పంపించేశారు.

భారత్‌లో ఇటువంటివి సర్వసాధారణమైన విషయాలే కావచ్చు కానీ అమెరికా తదితర విదేశాలలో ఇటువంటి చర్యలని తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయం అక్కడ నివశిస్తున్న తెలుగువారికి తెలిసే ఉంటుంది. అయినా అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసుల చేత చీవాట్లు తినడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆర్ఆర్ఆర్‌ సినిమాకి అమెరికాలో గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకొని మన దేశ, తెలుగు కీర్తి ప్రతిష్టలని విశ్వవ్యాప్తం చేస్తున్నప్పుడు విదేశాలలో స్థిరపడిన కొందరు ఈవిదంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మన దేశానికి, రాష్ట్రాలకి, మన సినిమాలకి అప్రదిష్ట తెచ్చేవిదంగా వ్యవహరించడం సరికాదు.

Related Post