అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజు భారీగా పెంచేసిన తర్వాత ఆ వీసాలతో అక్కడకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములు బయట పని చేయకుండా నిలువరించేందుకు ఆంక్షలు విధించారు. వాటితో ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మరిన్ని ఆంక్షలు విధించారు.
డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇకపై అమెరికా వీసాలు ఇవ్వకూడదని నిర్ణయించారు. అంతేకాదు ఊబకాయం ఉన్నవారికి కూడా అమెరికా వీసాలు లభించవు. వారి వైద్య సేవలకయ్యే ఖర్చు భారం అమెరికా ప్రభుత్వంపై పడుతోంది కనుక దానిని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం చెపుతోంది.
ఒకవేళ ఈ వ్యాధులున్నవారు అమెరికా రావాలనుకుంటే, సొంత డబ్బుతో చికిత్స చేయించుకోగల ఆర్ధిక స్థోమత కలిగి ఉండాలని లేదా మెడికల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ కలిగి ఉండాలని షరతు విధించింది. అలా ఉందని చెపితే సరిపోదు. బ్యాంక్ బ్యాలన్స్, ఇన్స్యూరెన్స్ కవరేజ్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే అమెరికా వీసా లభిస్తుంది.
ఈ తాజా నిబందనతో అమెరికా వీసాలలో 25-30 శాతం వరకు తగ్గిపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక ఇకపై అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులకు తలుపులు మూసివేస్తున్నట్లే భావించవచ్చు.
అమెరికాలో లక్షల మంది భారతీయులు స్థిరపడ్డారు. కనుక వారి తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు వారి వద్దకు వెళ్ళి 3-6 నెలలు ఉండి తిరిగి వస్తుంటారు. అటువంటివారికి కూడా ఈ తాజా నిబంధనతో అమెరికా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడవచ్చు.