అమెరికాలో కాల్పులు... జెరుసలెంలో బాంబు ప్రేలుళ్ళు

November 23, 2022
img

అమెరికాలో మళ్ళీ మరోసారి కాల్పులు జరిగాయి. వర్జీనియా రాష్ట్రంలో చెసాపీక్‌లోని శామ్ సర్కిల్ వద్దగల వాల్‌ మార్ట్ షాపింగ్ మాల్లో అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు అదే సంస్థలో పనిచేస్తున్న స్టోర్‌ మేనేజర్ హటాత్తుగా తుపాకీతో బ్రేక్ రూములోకి జొరబడి అక్కడ విశ్రాంతి తీసుకొంటున్న సాటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత షాపింగ్ కోసం వచ్చిన వినియోయాగ్దారులపై కాల్పులు జరుపడంతో 10 మంది ఘటనాస్థలంలోనే చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు అర్దగంటకు పైగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన తర్వాత అతను తుపాకీతో  కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ మేనేజర్ సాటి ఉద్యోగులపై, వినియోగదారులపై ఎందుకు కాల్పులు జరిపాడో ఇంకా తెలియవలసి ఉంది. వారం రోజుల క్రితమే అమెరికాలో కొలరైడో స్ప్రింగ్స్ లోని ఓ నైట్ క్లబ్బులో కాల్పులు జరిగాయి. వాటిలో ఐదుగురు మృతి చెందారు. 

జెరూసలెంలో ఉగ్రవాదుల దాడి: 

యూదుల పవిత్ర స్థలమైన జెరూసలెం ఈరోజు ఉదయం రెండు వరుస బాంబు ప్రేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. జెరూసలెంలో అత్యంత రద్దీగా ఉండే ఓ బస్టాండ్ వద్ద నిలిపి ఉంచిన ఓ ద్విచక్రవాహనంలో అమర్చిన బాంబు పేలింది. ఆ ప్రేలుడు ధాటికి 14 మంది తీవ్రంగా గాయపడగా ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపటికే రామోట్ అనే జంక్షన్ వద్ద ఆగి ఉన్న బస్సు వద్ద మరో ప్రేలుడు జరిగింది. క్షతగాత్రులని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం. అటువంటి దేశంలో వరుసగా రెండు ప్రేలుళ్ళు జరుగడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఇది ఖచ్చితంగా పాలస్తీనా ఉగ్రవాదుల పనే అయ్యుండవచ్చని ఆ దేశ హోమ్ మంత్రి ఇట్మార్ బెన్ అనుమానం వ్యక్తం చేశారు.


Related Post