అమెరికాలో తెలంగాణా యువకుడు మృతి

January 30, 2018
img

సిద్ధిపేట జిల్లాకు చెందిన వెంకన్నగిరి కృష్ణ చైతన్య (30) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమెరికాలో డల్లాస్ నగరంలో తన నివాసంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఆయన హైదరాబాద్ లోని కాగ్నిజెంట్ కంపెనీ తరపున డల్లాస్ లోని సౌత్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ లో ఒక ప్రాజెక్టు వర్క్ పూర్తి చేయడానికి కొంతకాలం క్రితం వచ్చి ఆర్లింగ్టన్ లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు. శుక్రవారం నుంచి కృష్ణ చైతన్య తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా కృష్ణ చైతన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు అతని శవాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అతని మరణానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ సంగతిని పోలీసులు అతని తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.    

చైతన్య తండ్రి శ్రీనివాసులు ఒక బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నారు. చైతన్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా సిద్ధిపేటకు రప్పించవలసిందిగా మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విదేశాంగశాఖకు అభ్యర్ధన పంపారు. విదేశాంగశాఖ కూడా వెంటనే స్పందించి హ్యూస్టన్ లోని భారత కౌన్సిలేట్ అధికారులను తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. డల్లాస్ లో ఉన్న ప్రవాస తెలంగాణావాసులు గోలి మోహన్, శ్రీధర్ మాధవేని పూనుకొని చైతన్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ పంపించేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని, జీవితంలో స్థిరపడ్డాడనుకొనే సమయానికి చైతన్య ఆకస్మిక మృతి చెందడం చాలా బాధాకరమే. ఆ తల్లితండ్రుల, భార్యాబిడ్డల శోకం ఎవరూ తీర్చలేనిదే! 

Related Post