కేటిఆర్ సూచన పాటిస్తే మంచిదే

January 23, 2018
img

స్విట్జర్లాండ్ లో దావోస్ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడానికి వెళ్ళిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్, అక్కడ స్థిరపడిన ప్రవాస తెలంగాణావాసులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు నెలకొని ఉన్న అయోమయ పరిస్థితులకు ఇప్పటికీ ఉన్న తేడాను చక్కగా వివరించిన తరువాత, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రవాస తెలంగాణావాసులు కూడా కృషి చేయాలని కోరారు. చిరకాలంగా విదేశాలలో స్థిరపడిన వారికి అనేక పెద్దపెద్ద సంస్థల అధినేతలతో పరిచయాలు ఉంటాయి కనుక వాటిని ఉపయోగించుకొని, తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు గట్టిగా కృషి చేయాలని కోరారు. విదేశాలలో ఉన్నవారందరూ తెలంగాణా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా భావించుకొంటూ మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనం గురించి అక్కడి ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియజేస్తుండాలని కోరారు. కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని, దానితో రాష్ట్రంలో వచ్చిన అనేక మార్పులను వారికి వివరించి, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాయని తెలిపారు. అయితే బంగారి తెలంగాణా కోసం రాష్ట్రంలో ఇంకా చాలా అభివృద్ధి జరుగవలసి ఉంది కనుక ప్రవాస తెలంగాణావాసులందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గోనవలసిందిగా మంత్రి కేటిఆర్ కోరారు. 

విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు చాలా మంది తమ సంస్కృతీ సంప్రదాయాలను చక్కగా పాటిస్తూ అప్రయత్నంగా బ్రాండ్ అంబాసిడర్ పాత్ర పోషిస్తూనే ఉన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేననే భావన చాలా మందికి ఉంటుంది. కానీ తమకున్నపరిచయాలను, పరపతిని ఉపయోగించి దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రవాస భారతీయులు కూడా  ఉడతాభక్తిగా కృషి చేయవచ్చునని కేటిఆర్ చెప్పిన సూచన అక్షరాల నిజం. 


Related Post