గమనిక: అమెరికా ప్రభుత్వం మూసివేయబడినది!

January 20, 2018
img

అవును. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం మూసివేయబడినది. ప్రభుత్వం రోజువారి నిర్వహణ నిమిత్తం ట్రంప్ సర్కార్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)లో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును డెమొక్రాట్ సభ్యులు అడ్డుకోవడంతో అమెరికాలో అత్యవసర సర్వీసులు అంటే రక్షణ, ఇమ్మిగ్రేషన్, హోంల్యాండ్ సెక్యూరిటీ వంటివి తప్ప మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.

విదేశాల నుంచి తల్లితండ్రుల వెంట అమెరికాకు వచ్చిన పిల్లలు అక్కడే పెరిగి పెద్దవారయ్యి, అక్కడే చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని అమెరికన్ పౌరులుగా స్థిరపడుతున్నారు. డ్రీమర్స్ గా పిలువబడేవారిని వెనక్కు త్రిప్పి పంపేందుకు ట్రంప్ సర్కార్ చేపట్టిన చర్యలను డెమొక్రాట్స్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వారి భవిష్యత్ కు భద్రత కల్పిస్తే తప్ప ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయబిల్లును ఆమోదించబోమని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుపట్టడంతో ఆ బిల్లు నిలిచిపోయింది.

శనివారంలోగా ఆ బిల్లు ఆమోదం పొందవలసి ఉంది. కానీ కాకపోవడంతో ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఖజానా నుంచి విడుదలకాకుండా నిలిచిపోయాయి. ఆ కారణంగా ప్రభుత్వం ‘షట్ డౌన్’ చేయబడింది. అంటే ‘అమెరికా మూసివేయబడినది’ అని బోర్డు తగిలించినట్లే చెప్పుకోవచ్చు. నేటి నుంచి దేశంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అమెరికా ప్రభుత్వంలో గల వివిధ శాఖలలో  మొత్తం మొత్తం 35 లక్షల మంది ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 850,000 నేటి నుంచి ‘వేతనం లేని శలవు’ తీసుకోవలసి ఉంటుంది. అమెరికన్ కాంగ్రెస్ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించేవరకు వారందరూ శలవులో ఉండిపోవలసి ఉంటుంది.

ఇదివరకు ఒబామా హయంలో అక్టోబర్ 2013లో ఇటువంటి పరిస్థితే ఏర్పడినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసి 800,000 మంది శలవు తీసుకోవలసి వచ్చింది. బిల్ క్లింటన్ హయాంలో డిసెంబర్ 1995 నుంచి జనవరి 1996 వరకు అత్యధికంగా 21 రోజుల పాటు షట్ డౌన్ అయ్యింది. ఈసారి అధికారంలో ఉన్నది జగమొండి ‘ట్రంప్’ కనుక ఆ రికార్డును బద్దలు చేయడం ఖాయమనే భావిస్తున్నారు.

ఈ షట్ డౌన్ వలన అమెరికా ప్రభుత్వానికి ‘వారానికి రూ.42,000 కోట్లు నష్టం’ కలుగుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే రోజుకు రూ.6,000 కోట్ల నష్టమన్నమాట! ట్రంప్ సర్కార్ కు ఏడాది పాలన పూర్తయిన మరుసటిరోజే ఈ షాక్ తగలడం విశేషం. 

Related Post