పాక్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా?

February 22, 2019
img

భారత్-పాక్‌ మద్య ఎప్పుడు ఉద్రిక్తతలు ఏర్పడినా మొట్టమొదటగా క్రికెట్, సినీపరిశ్రమలపై ఆ ప్రభావం పడుతుంటుంది. ఈసారి కూడా అదే జరుగుతోంది. పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ భారత్ సర్కార్ ఇప్పటికే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలుచర్యలు చేపట్టింది. ఇప్పుడు సినీ, క్రికెట్ రంగాల వంతు వచ్చింది. 

పుల్వామా దాడి జరిగిన వెంటనే షరా మామూలుగా బాలీవుడ్ లోని పలువురు పాక్‌ కళాకారులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారిపై బాలీవుడ్ ఆగ్రహించకపోయినా శివసేన ఆగ్రహించింది. అందరూ తక్షణం ముంబై విడిచిపెట్టి పాకిస్థాన్‌ తిరిగి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ కూడా ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్లు తమ దేశంలో హిందీ చిత్రాలను ప్రదర్శించకుండా నిషేదిస్తామని హెచ్చరించింది. 

ఇక ఇంగ్లాండ్ వేదికగా మే 30వ తేదీ నుంచి వరల్డ్ కప్ పోటీలు జరుగబోతున్నాయి. వాటిలో జూన్ 16న భారత్-పాక్‌ మద్య మ్యాచ్ జరుగవలసి ఉంది. ఆ మ్యాచులో భారత్ పాల్గొనకుండా నిరసన తెలియజేయాలని కొందరు వాదిస్తుంటే, ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో భారత్‌పై పాకిస్థాన్‌ ఎన్నడూ గెలువలేదు కనుక దానితో ఆడి మరోసారి ఓడించి పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు వాదిస్తునారు. అసలు పాకిస్థాన్‌ టీమును వరల్డ్ కప్ నుంచి బహిష్కరించాలని మరికొందరు వాదిస్తున్నారు. 

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకుండా ఆ టీంకు అప్పనంగా రెండుపాయింట్లు అందించి వరల్డ్ కప్ గెలుచుకొనే అవకాశం కల్పించడం సరికాదని, పాక్‌తో పోరాడి ఓడించే ప్రయత్నం చేయకుండా తప్పుకోవడం ఓటమిని అంగీకరించడమే అవుతుందని గవాస్కర్, సచిన్ టెండూల్కర్ తదితరులు వాదిస్తున్నారు. కనుక అంతర్జాతీయ వేదికపై పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని విడిచిపెట్టకూడదని వాదిస్తున్నారు. 

భారత్ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాస్త భిన్నంగా స్పందించారు. “పాక్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా అనే విషయం కేంద్రప్రభుత్వం, బిసీసీ, ఐసీసీ నిర్ణయిస్తాయి. ఒకవేళ అసలు వరల్డ్ కప్ పోటీలలోనే భారత్ పాల్గొనవద్దని ప్రభుత్వం నిర్ణయించినా మేము దాని నిర్ణయానికి కట్టుబడి ఉంటాము,” అని చెప్పారు. 

వరల్డ్ కప్ గెలుచుకోవడం అందరూ ఎంత గొప్పగా భావిస్తారో, వరల్డ్ కప్ పోటీలలో పాకిస్థాన్‌ను ఓడించడం కూడా అంతే గొప్పగా భావిస్తుంటారు భారతీయులు. భారత్-పాక్‌ మద్య జరిగే క్రికెట్ మ్యాచ్ లను ఒక క్రీడగాకాక రెండు దేశాల మద్య జరుగుతున్న యుద్ధంగానే భావిస్తుంటారు. కనుక వరల్డ్ కప్ పోటీలలో భారత్ తప్పకుండా పాకిస్థాన్‌తో ఆడి దానిని చిత్తుచిత్తుగా ఓడించాలని క్రికెట్ ప్రేమికులు కోరుకొంటున్నారు. మరి ప్రభుత్వం, బిసీసీ ఏ నిర్ణయం తీసుకొంటాయో చూడాలి. ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి? పాక్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా?

Related Post