నామినేషన్స్‌కు నేడే చివరి రోజు

April 25, 2024


img

లోక్‌సభ ఎన్నికలలో 4వ దశలో భాగంగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో నామినేషన్స్‌ వేసేందుకు గడువు ఈరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు ముగియనుంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు కూడా నామినేషన్స్‌ గడువు నేటితోనే ముగియనుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో దాదాపు అభ్యర్ధులు అందరూ నామినేషన్స్‌ వేశారు. మిగిలినవారు ఈరోజు వేయబోతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ సీట్లకు ఎట్టకేలకు అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటించింది. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు కుమారుడు రఘురామారెడ్డికి, కరీంనగర్‌ అభ్యర్ధిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్‌లను ఖరారు చేసింది.

అలాగే ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు తీన్మార్ మల్లన్న పేరుని ఖరారు చేసింది. నేడు వీరందరూ నామినేషన్స్‌ వేయబోతున్నారు. 

ఏప్రిల్‌ 29వరకు నామినేషన్స్‌ ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ తర్వాత జరుగబోయేది ఎన్నికల కురుక్షేత్రమే. మే 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్‌ జరుగబోతోంది. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.


Related Post