జగన్‌కు కేసీఆర్‌ మద్దతు... లాభమా నష్టమా?

May 04, 2024


img

మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. గత ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున తన బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడుని ఓడించి గద్దె దించడానికి జగన్మోహన్‌ రెడ్డి అన్ని విదాలా సహాయపడ్డారు. 

కానీ ఈసారి పదవీ, అధికారం రెండూ లేవు కనుక కేసీఆర్‌ జగన్‌కు సాయపడలేకపోతున్నారు. కానీ మాట సాయం చేస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ మీడియా ముందుకు వెళ్ళి ఈసారి కూడా ఏపీలో వైసీపియే గెలిచి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. 

అయితే ఈవిదంగా చెప్పడం మంచిదా కాదా? బిఆర్ఎస్ పార్టీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? అని ప్రశ్నించుకుంటే, రెండూ అని చెప్పుకోవచ్చు. 

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలలో జగన్‌ అభిమానులు చాలామందే ఉన్నారు. కనుక వారందరూ బిఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతారు. కానీ అంతేమంది చంద్రబాబు నాయుడు అభిమానులు కూడా ఉన్నారు. వారందరూ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారుతారు.

అయితే ఈసారి రెండు రాష్ట్రాలలో ఒకే రోజున పోలింగ్‌ జరుగుతున్నందున జగన్, చంద్రబాబులను అభిమానించేవారు, వ్యతిరేకించేవారు తప్పకుండా ఏపీలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక కేసీఆర్‌ వ్యాఖ్యల వలన బిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతానికైతే పెద్దగా లాభమూ నష్టమూ ఉండకపోవచ్చు.

జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దయనీయ స్థితికి చేరుకుంది. అమరావతి నిర్మాణం అర్దాంతరంగా నిలిచిపోయింది. దాంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. కనుక ఈ దుస్థితికి కేసీఆర్‌ కూడా కారణమే అని ఆంధ్రా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. 

చంద్రబాబుని జగన్‌ అరెస్ట్ చేయించినప్పుడు మాట్లాడని కేసీఆర్‌, ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి అవుతారంటూ మాట్లాడుతుండటంతో ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. అయితే వారి ఆగ్రహం వలన తమకు నష్టం లేదని కేసీఆర్‌ భావిస్తునందునే జగన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. కానీ భవిష్యత్‌ బిఆర్ఎస్ పార్టీకి దీని వలన ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది.    



Related Post