బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను చిల్లర రాజకీయాలంటూ కొట్టిపడేశారు. వాటితో తనకు ఎటువంటి సంబందమూ లేదని ఏదైనా తప్పులు జరిగితే వాటికి సంబందిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పేశారు.
అయితే ఈ కేసులో నిందితుడుగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు, మాజీ సిఎం కేసీఆర్ ఆదేశం ప్రకారమే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, వారి సన్నిహితుల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసేవారిమని రాధాకిషన్ రావు చెప్పారు.
ప్రణీత్ కుమార్ బృందం వారి రాజకీయ, వ్యాపార ప్రత్యర్ధుల ఫోన్లు ట్యాపింగ్ చేసేవారిమని రాధాకిషన్ రావు చెప్పారు. ప్రణీత్ రావుతో కలిసి కొన్ని సెటిల్మెంట్స్ కూడా చేసిన్నట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకు కూడా తాము సహకరించిన్నట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు.
ఈ కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు రాధాకిషన్ రావు వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టుకు సమర్పించనున్నారు. దాని ఆధారంగా రాబోయే రోజుల్లో కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ పార్టీలో పలువురికి నోటీసులు పంపి విచారణకు పిలిపించే అవకాశం ఉంది.