గమనిక: నేను పెళ్ళి చేసుకోలేదు!

December 16, 2025


img

సినీ పరిశ్రమలో పుకార్లు, ఊహాగానాలు ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అటువంటిదే ఇదీను. ప్రముఖ నటి మెహ్రీన్ ఫిర్జాదా ఇటీవల రహస్యంగా ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారని ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ పేర్కొంది. అది ఆమె దృష్టికి రావడంతో వెంటనే ఖండించారు.

“నాపై చాలా కాలంగా ఇటువంటి పుకార్లు పుట్టిస్తూనే ఉన్నారు. అయినా గత రెండేళ్ళుగా నేను నోరు విప్పలేదు. ఇప్పుడు నేను రహస్యంగా పెళ్ళి చేసుకున్నానంటూ ఓ వెబ్‌సైట్‌ ఆర్టికల్ పబ్లిష్ చేయడంతో తప్పనిసరిగా స్పందించాల్సి వస్తోంది.

నేను ఎవరినీ పెళ్ళి చేసుకోలేదు. ఆ వెబ్‌సైట్‌ పేర్కొన్న వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. ఒకవేళ నేను ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలనుకుంటే నేనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ విషయం అందరికీ తెలియజేస్తాను,” అని చెప్పారు. 

ఈ పుకార్లకు ఓ కారణం కనిపిస్తోంది. 2022లో హర్యానకు చెందిన భావయా బిష్ణోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ వివాహ నిశ్చితార్ధం జరిగింది. కానీ అనివార్య కారణాల వలన వారి పెళ్ళి రద్దు చేసుకున్నారు.

అప్పటి నుంచి ఆమెపై ఇటువంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా పెళ్ళి చేసుకున్నారని పుకారు పుట్టించడంతో అది వ్యక్తిగతంగా ఆమెకు, ఆమె కుటుంబానికి చాలా ఇబ్బందికరంగా మారింది కనుక స్పందించక తప్పలేదు.


Related Post

సినిమా స‌మీక్ష