బీఆర్ఎస్‌ సర్పంచ్‌లను గెలిపిస్తే... ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు

December 16, 2025


img

తెలంగాణ పంచాయితీ ఎన్నికలలో మొదటి రెండు దశలలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక సర్పంచ్‌ స్థానాలు గెలుచుకోగా బీఆర్ఎస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బుధవారం మూడవ మరియు చివరి దశ పంచాయితీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

నియోజకవర్గం గ్రామ సభలో ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “బీఆర్ఎస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్‌లు మమ్మల్ని గెలిపించకపోతే చచ్చిపోతామని ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కానీ వారిని గెలిపించినా చచ్చిపోక తప్పదు. ఎందుకంటే, వారిని గెలిపిస్తే నేను నిధులీయను. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయను.

నా సహాయ సహకారాలు లేనిదే గ్రామాలలో బీఆర్ఎస్‌ సర్పంచ్‌లు అభివృద్ధి పనులు ఎలా చేయగలరు?కనుక ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఇందిరమ్మ ఇళ్ళు కావాలి... గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు అవ్వాలంటే కాంగ్రెస్‌ మద్దతు ఇస్తున్న సర్పంచ్‌లనే గెలిపించుకోండి. లేకుంటే మీ ఇష్టం,” అని అన్నారు. 

పార్టీలకు అతీతంగా జరుగాల్సిన ఈ పంచాయితీ ఎన్నికలు ఈవిధంగా పార్టీల ఒత్తిళ్ళతో వాటి నాయకుల కనుసన్నలలో జరుగుతుండటం బాధాకరమే. అయితే గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ జిల్లా, నియోజకవర్గం, గ్రామం అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధులకే ఓట్లు వేయమని బహిరంగంగానే చెపుతుండేవారు.

తమకే ఓట్లు వేస్తామని బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు గ్రామస్తుల చేత దేవుడిపై ప్రమాణాలు చేయించేవారు. వేరే పార్టీల తరపు గెలిచినవారు తర్వాత బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేరుతున్నామని చెప్పుకునేవారు. 

కనుక అధికార పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తేనే అభివృద్ధి లేకుంటే లేదన్న మాట! రాజకీయాలలో ఇది సహజమనిపించవచ్చు కానీ దురలవాటుగా మారిపోయిందని పంచాయితీ ఎన్నికలు మరోసారి నిరూపించి చూపుతున్నాయి.         


Related Post