దాదాపు రెండేళ్లుగా ఫామ్‌హౌసు నుంచే పార్టీని నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎట్టకేలకు బయటకు అడుగు పెడుతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొనబోతున్నారని సమాచారం.
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేర్పులు, భవిష్య కార్యాచరణ గురించి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలు, తీవ్ర ఆరోపణలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. నదీ జలాల పంపకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర రాష్ట్రానికి సంబందించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
పంచాయితీ మొదటి దశ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైన సీట్లు లభించాయి. నేడు జరిగిన రెందో దశ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల 16న మూడో దశలో కూడా ఇటువంటి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది. కనుక పంచాయితీ ఎన్నికలలో సత్ఫలితాలు సాధించిన తర్వాత కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తుండటం పార్టీ శ్రేణులకు పునరుత్తేజం కల్పించడం కోసమే కావచ్చు.