మనసున్న మంత్రి ఏపీ డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌

December 14, 2025


img

సినీ, రాజకీయ ప్రముఖులు సమాజంలో నిరుపేదలు, నిస్సహాయులను ఆదుకున్న వార్తలు తరచూ చూస్తూనే ఉంటాము. కానీ ఏపీ డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ అంధుల మహిళా క్రికెటర్ల సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకొని వారి ఇంటిని నిత్యావసర సరుకులు, గృహోపకరణాలతో నింపేశారు.

అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టును పవన్‌ కళ్యాణ్‌ ఆహ్వానించి ఒక్కో క్రీడాకారిణికి రూ.5 లక్షల చొప్పున నగదు బహుమతి ఇచ్చారు. మొత్తం రూ.84 లక్షలు తన స్వార్జితం నుంచి ఇచ్చారు.

వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు అడిగి తెలుసుకొని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా మంత్రులతో మాట్లాడి వారికి పక్కా ఇళ్ళు, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఆంధ్రా క్రికెట్‌ జట్టు కెప్టెన్ దీపిక, మరో క్రికెటర్ కరుణ కుమారి కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని గ్రహించిన పవన్‌ కళ్యాణ్‌, వారి కుటుంబాలకు అవసరమైన సమస్తం జనసేన నేతల ద్వారా అందించారు.

డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశం మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో నివసిస్తున్న దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లాలో నివసిస్తున్న కరుణ కుమారి ఇళ్ళకు జనసేన నేతలు వెళ్లి బియ్యం, పప్పులు, వంటనూనె, గిన్నెలు, కడాయిలు, కుక్కరు, కంచాలు, మిక్సీ వగైరా అందించారు.

అలాగే దుప్పట్లు, దిండ్లు, బకెట్లు కూడా ఇచ్చారు. ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఇస్త్రీ పెట్టె వగైరా ఇచ్చారు. అంతేకాదు క్రిస్మస్, సంక్రాంతి పండగలు దగ్గర పడుతున్నాయి కనుక ఇంట్లో అందరికీ కొత్త బట్టలు కూడా ఇచ్చారు.

దీపిక, కరుణ కుమారి కుటుంబాలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని, ఆ కొత్త ఇంటికి అవసరమైన ఫర్నీచర్, ఇతర సామాగ్రి అందిస్తానని పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు.

సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం తంబలహెట్టికి తారు రోడ్ వేయించాలని దీపిక కోరగా, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు మధ్యాహ్నం తహసీల్దార్ తదితరులు కలిసి ఆ గ్రామాన్ని సందర్శించారు.

వారు 5 కిమీ మేర తారు రోడ్లు వేసేందుకు రూ.6.2 కోట్లు అవసరమని అంచనా ఇవ్వగా, అదే రోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ ఆ పనులకు పరిపాలనా పరమైన అనుమతి మంజూరు చేశారు.

ఇలాంటి మనసున్న పాలకులనే కదా ప్రజలు కోరుకునేది. కానీ అధికారం చేతిలో ఉన్నా ఎంతమంది నాయకులు ఈ విధంగా స్పందిస్తారు?


Related Post