మిషన్ అఖిలేష్... దేనికో?

December 13, 2025


img

ఉత్తర ప్రదేశ్ మాజీ సిఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ గురువారం హైదరాబాద్‌ వచ్చారు. ముందుగా జూబ్లీహిల్స్‌లో సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనని కలిశారు. ఇద్దరూ కొంతసేపు జాతీయ రాజకీయాలపై మాట్లాడుకున్నారు. 

అనంతరం అయన నంది నగర్‌లో కేటీఆర్‌ ఇంటికి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. 

అయితే అఖిలేష్ యాదవ్ ఆకస్మికంగా హైదరాబాద్‌ వచ్చి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల ముఖ్యనేతలను కలవడం ఆలోచింపజేస్తుంది. ఇటీవల బీహార్‌ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌-ఆర్‌జేడి కూటమి మరోసారి బీజేపి-జేడీయు (ఎన్డీయే) చేతిలో ఓడిపోయింది.

 కేంద్ర ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళకు తలొగ్గి నకిలీ ఓట్లు ఏరివేత పేరుతో లక్షల ఓట్లు తారుమారు చేస్తొందని బీహార్‌ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్‌ ఎన్నికలలో కూడా అదే విధంగా ఎన్డీయే దొడ్డిదారిన గెలిచిందని కాంగ్రెస్‌-ఆర్‌జేడి కూటమి విమర్శిస్తోంది. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలలో ‘సర్' పేరుతో నకిలీ ఓట్ల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. కనుక ప్రతిపక్షాలన్నీ కలిసి దీనిని అడ్డుకోకపోతే ఇక ఎన్నటికీ అవి ఎన్నికలలో గెలవలేవు. కనుక ఆ పని మీదే అఖిలేష్ యాదవ్ హైదరాబాద్‌ వచ్చి ఉండవచ్చు. తర్వాత ఎన్నికలు జరుగబోయే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పర్యతిస్తారేమో?

 కానీ విపక్షాల ఐక్యతకి అతిపెద్ద అవరోధం ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరని తేల్చుకోలేకపోవడమే. అంతవరకు అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. 


Related Post