యావత్ ప్రపంచంలో ఫుట్‌బాల్ ప్రేమికులు అందరి ఆరాధ్య దైవం వంటి అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ వస్తే అది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే అలాంటి యువ ముఖ్యమంత్రి మనకున్నారని సంతోషించాలి. కానీ మాజీ మంత్రి హరీష్ రావుకి అది నచ్చలేదు.
“మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డికి టైమ్ ఉంది. కానీ నగరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రిపాలైతే పరామర్శించేందుకు టైమ్ లేదు,” అంటూ విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు శాయశక్తుల కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా హరీష్ రావుకు తప్పుగానే అనిపించింది.
‘బడి పిల్లలకు సరైన ఆహారం పెట్టలేడు కానీ మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ’ అని ప్రగల్భాలు పలుకుతున్నారంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.
ఓసారి కేసీఆర్ పాలనలోకి వెళ్లి చూస్తే, ఆయన హయంలో హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా అనేకసార్లు వరదలు వచ్చాయి. నగరం నీట మునిగింది. పంటలు మునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కానీ సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడూ ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. ఎవరినీ పరామర్శించలేదు. పైగా తన, పార్టీ స్వార్థ రాజకీయాల కోసం నిత్యం కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తుండేవారు. ఆ కారణంగా కూడా కేంద్రం నుంచి అందాల్సినంత సాయం అందేది కాదు.
కేసీఆర్ హయంలో జరిగిన అవినీతి కథలు కల్వకుంట్ల కవిత స్వయంగా చెబుతూనే ఉన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పార్టీని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు తనని బయటకు గెంటించిన హరీష్ రావు రేపు కేటీఆర్‌ని బయటకు గెంటించకుండా ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు కదా?
ఆమె ప్రశ్నలు, ఆరోపణలకు హరీష్ రావు జవాబు చెప్పడం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు.
నాడు కేటీఆర్ కుమారుడు హిమాంశు నగరంలో నాంపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూసి దానిని దత్తత తీసుకొని విరాళాలు సేకరించి మరమత్తులు చేయించారు. అంటే అర్థం ఏమిటి? ప్రగతి భవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ పట్టించుకోలేదనే కదా?
నగరంలో భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఉస్మానియా ఆస్పత్రిలోని వార్డుల్లోకి వరద, బురద నీళ్లు వచ్చి చేరుతుండేవి. కానీ కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆ సమస్యను పరిష్కరించలేదు కదా?
వరదలు వచ్చి నగరంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే కేటీఆర్ వెళ్లి ఫోటోలు దిగి వచ్చే ఏడాదిలోగా సమస్య పరిష్కరించేస్తానని చెప్పేవారు. కానీ నేటికీ ఆ సమస్య అలాగే ఉంది కదా?
సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో ఓ గంటసేపు స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడటం తప్పయితే, నాడు కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్‌లో ఎఫ్-1 రేసింగ్ నిర్వహణ ఏర్పాట్లకు అంకితమైయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా? అది తప్పు కాదా?
అయినా మెస్సీ కోల్‌కతాలో పర్యటించినప్పుడు అక్కడ ఎంత విధ్వంసం జరిగిందో అందరూ చూశారు. కానీ అదే మెస్సీ అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో పర్యటించి, ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ ఆడినప్పుడు అంతా ఎంత సజావుగా జరిగిందో హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు చూశారు కదా?
అందుకు సీఎం రేవంత్ రెడ్డిని అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు. మెస్సీ పర్యటనతో సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా యావత్ దేశం, యావత్ ప్రపంచంలో మారుమ్రోగిపోయిందనే అసూయతోనేనా?