రేవంత్‌ రెడ్డి జాతీయ నాయకుడుగా ఎదగబోతున్నారా?

May 03, 2024


img

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్‌గా మారడం చాలా ఆసక్తికరమైన పరిణామమే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కొరకు ఇటీవల తమిళనాడులో పర్యటించి వచ్చిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. 

శుక్రవారం ఉదయం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో యూపీకి బయలుదేరి వెళ్ళారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా రాయ్‌బరేలీ చేరుకున్నారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన నామినేషన్స్‌ ర్యాలీలో రేవంత్‌ రెడ్డి, ఖర్గే ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి బరేలీ ప్రజలను ఊదేశ్యించి క్లుప్తంగా ప్రసంగించారు. రాహుల్ గాంధీ నామినేషన్ వేయడం పూర్తికాగానే సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.      

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేతలు రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని ఎంతగా వ్యతిరేకించినప్పటికీ ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం నమ్మకం పొంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్‌ అధిష్టానం అండదండలతో ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే స్థాయికి ఎదిగారు. అయితే తెలంగాణలో ఆయన ప్రభుత్వానికి అటు బీజేపీ, ఇటు బిఆర్ఎస్ పార్టీల నుంచి ప్రమాదం పొంచి ఉంది. కనుక ఈ గండం కూడా గట్టెక్కి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సాగితే, రేవంత్‌ రెడ్డికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగు ఉండదు.  



Related Post