పద్మశ్రీ పెన్షన్: కాంగ్రెస్‌, బిఆర్ఎస్ మరో మినీ యుద్ధం

May 04, 2024


img

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. మన రాజకీయాలకు కూడా ఆయన కవిత నూరు శాతం వర్తిస్తుంది.  

పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10,000 పింఛన్ చెల్లిస్తోంది. కానీ అది అందకపోవడంతో ఆయన కుటుంబ పోషణ కొరకు రోజు కూలీగా పనిచేయవలసి వస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మళ్ళీ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య ఆయన పెన్షన్ అంశంపై మరో కొత్త యుద్ధం మొదలైంది. 

తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆయనకు కేసీఆర్‌ కోటి రూపాయలు నగదు బహుమతి, ఇంటి స్థలం ఇచ్చారు. కోటి రూపాయలు పిల్లల పెళ్ళిళ్ళకు ఖర్చు అయిపోయాయని, కనుక చేతిలో డబ్బు లేకపోవడంతో ఇల్లు కట్టుకోలేకపోయానని దర్శనం మొగులయ్య చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చే పింఛనులో రూ.6-7,000 తమ వైద్య చికిత్సలు, మందులకే పోతోందని చెప్పారు. కొన్ని నెలలుగా రూ.10 వేలు పింఛన్ కూడా అందడం లేదని ఆయన చెప్పారు. కనుక కుటుంబ పోషణకు రోజూ కూలిగా పనిచేస్తున్నానని చెప్పారు. 

ఈ వార్తపై బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ, “తెలంగాణకు గర్వకారణమైన దర్శనం మొగులయ్య వంటి కళాకారుడికి ఈ దుస్థితి కలిగినందుకు చాలా బాధ పడుతున్నాను. ఇకపై ఆయన కుటుంబ బాధ్యత నేను తీసుకుంటాను. తక్షణమే నా సిబ్బంది ఆయనను కలిసి అవసరమైన సాయం అందిస్తారు,” అని చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన పింఛన్ నిలిచిపోయిందని కేటీఆర్‌ చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఆదుకోకపోయినా బిఆర్ఎస్‌ పార్టీ ఆదుకుంటుందని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే స్పందించింది.

దర్శనం మొగులయ్యకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలనెలా రూ.10 వేలు పింఛన్ చెల్లిస్తూనే ఉందని తెలియజేస్తూ, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో మార్చి 31వ తేదీన ఆయనకు పింఛన్ చెల్లించిన స్క్రీన్ షాట్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుందని దానిలో పేర్కొంది.       


Related Post