కాంగ్రెస్‌ హామీల ఎఫెక్ట్: భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు?

May 18, 2024


img

శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎడాపెడా హామీలు ఇచ్చేసింది. కానీ వాటన్నిటికీ నిధులు లేవనే సంగతి అధికారంలోకి వచ్చాక తెలుసుకుంది.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్పులు చేసిందని, తమ ప్రభుత్వంపై ఆ ఋణభారమే చాలా ఎక్కువగా ఉందని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అప్పుల గురించి శ్వేతపత్రాలను కూడా విడుదల చేశారు. 

ఈ పరిస్థితులలో కాంగ్రెస్‌ పధకాలు, హామీలు అన్నిటినీ అమలుచేయాలంటే కనీసం లక్ష కోట్లు అవసరం ఉంటుందని, అంత సొమ్ము ఎక్కడి నుంచి తెస్తారని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టి ముందుగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంపై దృష్టి పెట్టింది. సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం మేరకు రెవెన్యూ శాఖ అధికారులు రాష్ట్రంలో భూముల ధరలు పెంచడంపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. 

ప్రభుత్వ ధరకు, మార్కెట్ ధరకు భారీగా తేడా ఉన్న ప్రాంతాలలో 100 శాతం పెంచాలని, మిగిలిన ప్రాంతాలలో 50 నుంచి 100 శాతం వరకు పెంచడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021లో ఒకసారి, మళ్ళీ 2022లో మరోసారి వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా రూ,12,370 కోట్లు, రూ.15,000 కోట్లు ఆదాయం సమకూరింది. 

ఆగస్ట్ 15లోగా రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు కనుక జూన్ నెల నుంచే రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే అవకాశం ఉంది.

కనుక సామాన్య, మద్యతరగతి ప్రజలు భూములు, ఇళ్ళు లేదా అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే తక్షణమే కొనుగోలు చేసుకుంటే ఈ అధనపు భారం నుంచి తప్పించుకోగలుగుతారు.


Related Post